calender_icon.png 27 September, 2024 | 9:45 AM

దిగివచ్చిన దేవతలు మన గోవులు

27-09-2024 12:00:00 AM

భారతీయ ఆవుల వెనుక మూపురం, వంపు తిరిగిన దేహ భాగం, సూర్యరశ్మిని గ్రహించే సామర్థ్యం, మెడకింద వేలాడే చర్మం, వదులైన మడతలు, డెక్కల మధ్య అంతరం మొదలైన లక్షణాలు ఉంటాయి. భారతదేశంలో ఆవు చాలా పవిత్రమైంది. మానవాళికి అందించే విశేష ప్రయోజనాల కారణంగా, మన దేశంలోని ప్రజలు ఆవును ‘దేవుని భూసంబంధ స్వరూపం’గా ఆరాధిస్తారు. భారతీయ దేశీ ఆవుల వెన్నెముక మీది మూపురంపై శక్తివంతమైన సౌరనాడులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి సహాయంతో ఇవి సూర్యుని శక్తిని గ్రహిస్తాయి. వెనుక భాగంలోని వంపైన ప్రదేశంలోనే ‘సూర్యకేతు’ నాడి ఉంటుంది. అది సూర్యకాంతిసహా వాతావరణంలోని అన్ని సానుకూల ఔషధ శక్తులనూ గ్రహిస్తుంది. ఈ కారణాలవల్లే మన ఆవులు అత్యంత పోషకాలతో కూడిన పాలను ఇస్తున్నట్టు వారు చెబుతున్నారు. విసర్జకాలుగా ఔషధ విలువలతో కూడిన పేడ, పంచకాన్ని (మూత్రం) ఇస్తాయి.

దక్షిణాసియా దేశీయ పశువుల ఉపజాతి లేదా జాతికి చెందిన ఆవును ‘జెబు’ (Zebu)గా పిలుస్తారు. జీవశాస్త్ర పరంగా దీనిని ‘బోస్ టారస్ ఇండికస్’ లేదా ‘బోస్ ప్రిమిజెనియస్ ఇండికస్’ అని అంటారు. విలక్షణమైన మూపురంతోపాటు వంగిన చెవులనూ ఇవి కలిగి ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల సామర్థ్యం వీటి సొంతం. అందువల్లే ఉష్ణమండల వాతావరణ దేశాలలో వీటిని విరివిగా పెంచుతుంటారు. భారతీయ ఆవులలో ఈ విశిష్ట లక్షణాలు యుగయుగాలుగా కొనసాగడమేకాక ప్రాంతీయ భౌగోళిక పరిస్థితులలో గణనీయంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఇందువల్లే ప్రపంచమంతటా మన ఆవులు బాగా ప్రాచుర్యం పొందాయి. అధిక నాణ్యతగల పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మానవుని భావోద్వేగ, శారీరక, ఆధ్యాత్మిక, మానసిక శ్రేయస్సును పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉండటం మన ఆవులలోని మరో ప్రత్యేక లక్షణం. 

కామధేనువు వారసులు

‘ధేనూనామస్మి కామధుక్’ (భగవద్గీత: 10---28) అంటే, ‘పాడి ఆవులలో కోర్కెలు తీర్చే కామధేనువును నేను.” సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని మాటలివి. సురభి’ పేరున పిలిచే గోవు కూడా ఇదే. శాస్త్రీయంగా ఎంతో ప్రాముఖ్యం గల భారతీయ ఆవుల ఔన్నత్యానికి గొప్ప దివ్యత్వాన్ని ఆపాదించే మూల కారణమూ లేకపోలేదు. హిందూమత విశ్వాసం ప్రకారం, ‘ప్రతీ ఆవు పవిత్రమైందే. కామధేనువుకు సజీవ స్వరూపమే’. శ్రీకృష్ణుడే స్వయంగా అనేక సురభి గోవులను పెంచుతూ, వాటిని మేపుతుండే వాడు. భారతీయ వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు చదివిన వారికి మన ఆవుల విశిష్టత, గొప్పతనం తెలియక పోదు.

అమృతం కోసం దేవ క్షీరసాగరాన్ని చిలికే వేళ హాలాహలం అనంతరం తొలుత కామధేనువే ఐదు రూపాల (బహుళ, సుశీల, సురభి, సుభద్ర, నంద)లుగా ఉద్భవించింది. స్వర్గంలో తాము గ్రహించిన అమృతాన్ని మానవాళికి అణుమాత్రంగానైనా అందించడమే వీటి ఏకైక లక్ష్యం. వాటి ప్రత్యక్ష వారసులుగానే భారతీయ ఆవులను అభివర్ణిస్తారు. ఈ రకంగా ఇవి 33 కోట్ల దేవతలుసహా మానవాది జీవకోటికి అంతటికినీ గోమాతలుగా వర్ధిల్లుతున్నాయి. కలియుగ మానవులకు అవి ఇచ్చే పాలు అమృత సమానం. ఇంతటి ప్రాధాన్యం గల మన ఆవులను సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రతీ ఒక్కరిదీ.