calender_icon.png 25 November, 2024 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలి

24-11-2024 12:00:00 AM

మానవ జీవన పరిణామ క్రమంలో అనవసర సహజవనరుల వినియోగం పెరుగుతోంది. అభివృద్ధి ముసుగులో, నవీన జీవన శైలి అని అవసరానికి మించి, ప్రకతి నియమాలకు విరుద్ధంగా సహజ వనరులను దోపిడీ చేస్తూ వినియోగిస్తున్నాడు. ఈ తప్పుడు ఆలోచలే వాతావరణ మార్పులకు ముఖ్య కారణమవుతున్నాయి. ఇది అందరూ గమనించకపోతే మానవ జీవనంతోపాటుగా జీవ ఆవాసాలు నిర్వీర్యమై ఎడారులుగా మారనున్నాయి. 

వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రపంచ నాయకత్వం అంతర్జాతీయ స్థాయిలో కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. అదే సమయం లో వ్యక్తులుగా  ఉద్గారాల నియంత్రణకు మన వంతు కృషి చేయాలి. హీటర్లు అమర్చుకోవడం దగ్గరి నుంచి ఇంట్లో చేసుకునే అనేక మార్పులు భూమికి మేలు చేస్తాయి. అవసరం లేనప్పుడు లైట్లు, గృహోపకరణాలను స్విచ్ ఆఫ్ చేయడం, నీటిని పొదుపుగా వాడడం లాంటి పర్యావరణ హిత కార్యాల వల్ల వాతావరణ మార్పులపై పడే ప్రభావం తగ్గడమే కాకుండా డబ్బుకూడా ఆదా అవుతుంది.

గ్రీన్ హౌస్ ఉద్గారాలలో 14 శాతం పెంపుడు పశుపక్ష్యాదుల కారణంగా వెలువడుతున్నాయి. ఇందులో పశుసంపద పాత్ర మరీ అధికం. దీన్ని తగ్గించాలంటే మన ఆహారంలో పాడి ఉత్పత్తులు తగ్గించాలి. గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు వంటి వాటి మాంసాన్ని వినియోగించడం మానేయాలి. 

ప్రపంచ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలలో 25 శాతం రవాణా వల్ల వెలువడుతున్నవే. కార్లు వాడడం మానేస్తే రవాణా వల్ల వెలువడే కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోతుంది. ప్రజా రవాణా, సామూహిక వాహన ప్రయాణాలను పెంచుకోవడం చేయాలి. పునరుత్పాదక శక్తి వనరులతో నడిచే వాహనాలను విధిగా వాడుకోవాలి. ఉపయోగించిన పదార్థాల వ్యర్థాలను  శాస్త్రీయ పద్ధతులద్వారా తిరిగి వాడుకోవడం, కంపోస్టు ఎరువుగా మార్చుకోవడం వల్ల వాయుకాలుష్యాన్ని తగ్గించవచ్చు.

వీటితో పాటుగా చెట్లు నరకడాన్ని అరికట్టడం, అడవుల పెంపకం లాంటి వాటిని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం ద్వారా మనవంతుగా వాతావరణాన్ని కాపాడుకోవచ్చు. హరిత స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో పర్యావరణ హిత కార్యక్రమాలు చేయడం. అదే క్రమంలో అడవుల పెంపకాన్ని ప్రోత్సహించి మనవంతుగా భూ మండలాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం.

-- రవిబాబు పిట్టల, వరంగల్