15-04-2025 05:57:34 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కొరివి గేటు సమీపంలో 255/1 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలో చాలాకాలంగా సిపిఎం ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున రెవెన్యూ, పోలీస్ అధికారులు గుడిసెల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేందుకు రావడం తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. గుడిసెల తొలగింపు చేపడితే తాము పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గుడిసవాసులు, సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రెవెన్యూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గుడిసెలు తొలగింపుకు ఎదురొడ్డి నిలిచారు. దీనితో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెవెన్యూ పోలీస్, అధికారులు కొంత వెనక్కి తగ్గి విషయాన్ని వెంటనే అధికారులకు తెలిపారు.
ఈ నేపథ్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సూర్ణపు సోమయ్య, గునిగంటి రాజన్న ఆకుల రాజు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ను కలిసి అక్కడ పూర్తిగా నిలువ నీడలేని పేదలు నివాసం ఉంటున్నారని, వారిని ఉన్న ఫలంగా తొలగించడం సరైనది కాదని, విచారణ జరిపి అర్హులైన వారికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. దీనితో కలెక్టర్ వెంటనే ఆర్డీవో కృష్ణవేణి కి ఈ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. గుడిసెల తొలగింపు కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకొని అధికారులు వెనక్కి వెళ్లిపోయారు.
అనంతరం ఆర్డీవో ఆ ప్రాంతానికి చేరుకొని విచారణ జరిపి పూర్తి నివేదిక కలెక్టర్ కు అందిస్తామని తెలిపారు. దీనితో ఉత్కంఠకు తెరపడింది. అయితే సిపిఎం నాయకులు మాత్రం వందల ఎకరాల ప్రభుత్వ భూమిని బడా నేతలు ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే పట్టించుకోని అధికారులు, నిలువ నీడ లేక పేదలు వేసుకున్న గుడిసెలు జోలికి రావడం సరైనది కాదని పేర్కొన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి భానోత్ సీతారాం నాయక్, ఎండి రజాక్, భానోతు వెంకన్న, మహేందర్, తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుడిసె వాసులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.