14-02-2025 12:00:00 AM
సంత్ సేవాలాల్ జయంతి రేపు :
ధర్మ ప్రచారంతోపాటు గిరిజనుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసి బంజారాలకు ఆరాధ్యదైవంగా మారిన గురువు సంత్ సేవాలాల్. జంతుహింసకు వ్యతిరే కంగా గిరిజనులను చైతన్యపరిచిన మహానుభావుడు సేవాలా ల్. బంజారాలకు 22 జీవన సూత్రాలను ఉపదేశించిన తా త్వికుడాయన. మత్తుమందులు, ధూమపానం శాపమని గిరిజనులకు ఉద్బోధించిన ఉత్తమ పథ మార్గదర్శకుడు.
బంజారా జాతిని సన్మార్గంలో నడిపించేందుకు కంకణం కట్టుకు న్న అవతారపురుషుడిగానూ ఆయనను బంజారాలు భావిస్తారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని సేవాగఢ్ గ్రామ పరిధిలోని రాంజీనా యక్ తాండాలో 1739 ఫిబ్రవరి 15న క్రాంతిసింగ్ వీర శిరోమణి సేవాలాల్ జన్మించారు. అయితే, బ్రిటిష్ వలస పాలకులు ఆయన అసలు పేరును శివ రాథోడ్‌గా పేర్కొన్నారు.
మేరమ్మగా అక్కడి గిరిజనులు కొలిచే జగదాంబకు మేకపోతులను బలి ఇవ్వడాన్ని సేవాలాల్ వ్యతిరేకించారు. మేరమ్మకు బలి ఇవ్వకూడదని గిరిజనులకు ఆయన సూచిస్తారు. ఆ సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సేవాలాల్ వైఖరి కారణమని ఆరోపిస్తూ తాండా వాసులు ఆయనను బహిష్కరిస్తారు. సాతీ భవానీలైన ఏడుగురు అమ్మవార్ల స్వరూపాలకు ఏడు మేకపోతులను బలి ఇవ్వడానికి గిరిజనులు సిద్ధపడతారు.
దీన్ని వ్యతిరేకించిన సేవాలాల్ అమ్మవారికి బలి ఇష్టమైతే మేకలకు బదులుగా తాను బలిదానం అయ్యేందుకు సిద్ధమని ప్రకటిస్తారు. తన రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి, బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకొమ్మని జగదాంబను ప్రార్థిస్తూ, ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకుంటారు. అప్పుడు జగదాంబ ప్రత్యక్షమవు తుంది. సేవాలాల్ శిరస్సును తిరిగి శరీరానికి జోడించి ప్రాణం పోస్తుంది.
“ఇన్నాళ్ళూ నేను పెట్టిన పరీక్షలో సేవాలాల్ నెగ్గాడు. నిజమైన భక్తుడు, సమాజ సేవకుడైన సేవాలాల్ నాయకత్వంలో ప్రయాణించమని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి జగదాంబ మాతను తన మార్గదర్శకురాలిగా, గురువుగా భావించి అన్ని విద్యలను నేర్చుకుంటారు సేవాలాల్. కొండప చాముండేశ్వరి దేవతామూర్తుల విగ్రహాలతో బాల్యంలో ఆటలాడుకున్న అతను పెరిగి పెద్దయ్యాక ఆవులు కాసేవాడు.
తల్లి సద్ది కట్టిస్తే దాన్ని వేరేవారికి ఇచ్చేవాడు. ఆవుల వెంట అడవికి వెళ్ళే అతను అక్కడ బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు. తన ఉపదేశాలను తాను ముందుగా ఆచరించి చూపిన గొప్ప తత్త్వవేత్త సేవాలాల్. మహారాష్ట్రలోని రుహియాగఢ్‌లో 67 సంవత్సరాల వయసులో 1806 డిసెంబరు 4న అస్తమించారు సేవాలాల్. వషిం జిల్లాలోని పొహ్రా గ్రామంలో సమాధి అయ్యా రు. సేవాలాల్ బోధనలు కలకాలం బంజారాలను నడిపిస్తూనే ఉంటాయి.
డా. రాయారావు సూర్యప్రకాశ్‌రావు