08-03-2025 11:07:07 PM
కలెక్టర్ జితేష్ వి పాటిల్...
చర్ల/దుమ్ముగూడెం (విజయక్రాంతి): మహిళా అనేది ప్రకృతి ప్రతిగా అందానికి నిర్వచనం ఇంటికి దీపం ఇల్లాలు, అమృతాన్ని వర్షించే అమ్మగా, అనునాయించి, అక్కగా, అనురాగాన్ని పంచే చెల్లిగా, ఆత్మీయతను కురిపించే భార్యగా ఆమె ఒక కుటుంబానికి ఎంత సుపరిచితురాలో మహిళలకు మన దేశంలో అంత ప్రాధాన్యత ఉందని, మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుండే ప్రారంభం కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం దుమ్ముగూడెం మండలంలోని బొజ్జగుప్ప ఏకో టూరిజం స్పాట్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ... సమాజంలో స్త్రీ పాత్ర అనేది చాలా ముఖ్యమైనదని, పురుషులతో సమానంగా ఏ రంగంలోనైనా తమ హక్కులను కాపాడుకోవడానికి ముందుండి ఎన్నో విజయాలు సాధించారని ఒక టీచర్ గా, డాక్టర్ గా, పోలీస్ ఆఫీసర్ గా, పైలట్గా రైతు కూలీగా ఇంటి పనులు చేసే పని మనిషిగా ఇలా అన్ని హోదాలలో కూడా సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నది మహిళలే అన్నారు.
భారతీయ సంస్కృతిలో స్త్రీలకు సముచిత స్థానాన్ని అందించారని మనం నిత్యం ఆరాధించే విద్యా శక్తి జ్ఞాన శక్తి స్వరూపురాలైన అమ్మవారులు కూడా స్త్రీలే అని, స్త్రీని ఒక దేవతలా చూడడం ఆమెను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది అనాదిగా మన రక్తంలోనే జీర్ణించిపోయిందన్నారు. బోజ్జుగుప్ప గ్రామంలోని గిరిజనులు చాలా కష్టజీవులని టూరిజం స్పాట్గా ఏర్పాటు చేయడానికి ఎంతో శ్రమించి ముందుకు వచ్చారని, సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న మన భద్రాచలంలో ఎంతోమంది టూరిస్టులు వస్తూపోతూ ఉంటారని వారికి మన ఆచార వ్యవహారాలు సాంస్కృతి సాంప్రదాయాలు గిరిజన వంటకాలు తెలిసే విధంగా చేయడం కోసం ప్రయత్నం చేశామని అందుకు చాలావరకు సత్ఫలితాలు పొందామని అన్నారు. గ్రామాలలో సహజంగా పండే కరక్కాయలు ఇప్ప పూలు వాటిని అందంగా డిజైన్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసి వాటి ప్రాచుర్యాన్ని తెలపడం కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు.
అనంతరం భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు మాట్లాడుతూ... మహిళల సమానత్వం మన ఇంటి నుండే ప్రారంభం కావాలని, ఇంట్లో ఆడపిల్లలను మగ పిల్లలను సమానంగా చూడాలని, సమాజంలో మహిళలకు అన్ని రంగాలలో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పం అని అన్నారు. సమాజంలో పురుషులతోపాటు మహిళలకు సమాన హక్కులు కలిగి ఉండాలని, విద్య, ఉపాధి రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో మహిళలు కీలక స్థానాలను అధిరోహించాలని, అమ్మాయిల చదువు ప్రతి కుటుంబానికి వెలుగు ఇస్తుందని, తల్లిదండ్రులు తమ కుమార్తెకు పూర్తి స్వేచ్ఛని ఇస్తూ మంచి విద్యను అందించాలని, ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ మహిళల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని, ఉద్యోగం చేయాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా అవసరం అని, పనిచేస్తున్న ప్రదేశాలలో మహిళలకు సరైన గౌరవం భద్రత కల్పించాలని అన్నారు.
అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కలిసి జిల్లా కలెక్టర్, శాసనసభ్యులను సన్మానం చేశారు. దిగ్విజయంగా మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మహిళలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని కూడా జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు సన్మానించి అనంతరం గిరిజన మహిళలు తయారుచేసిన రాగిజావను సేవించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి మహిళా శక్తి ఉపాధ్యక్షురాలు సుధారాణి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.