- శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
- అత్యంత విశిష్ట నేతల్లో మన్మోహన్ ఒకరు: మోదీ
- మన్మోహన్ ఒక లెజెండ్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోగల గాహ్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సింగ్ గురుముఖ్ సింగ్, అమృత్‌కౌర్. ఆయన చిన్న వయసులోనే తల్లి మరణించడంతో తన నానమ్మ దగ్గరే పెరిగారు. మన్మోహన్ ప్రారంభ విద్యాభ్యాసం అంతా ఉర్దూ మాధ్యమంలో జరిగింది. 1974లో దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం భారతదేశం లోని హల్దానీకి వలస వచ్చింది.
అనంతరం 1948లో వారి కుటుంబం అమృత్‌సర్‌కు మకాం మార్చారు. అమృత్‌సర్‌లోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియేట్ పూర్తి చేశారు. అనంతరం హోషియాపూర్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ అభ్యసించారు. 1957లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఫిలాసఫీలో డాక్టరేట్ చేశారు. అనంతరం ఆయన భారతదేశానికి తిరిగొచ్చి పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ విధులు నిర్వర్తించారు. అనంతరం 1966 మధ్య యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్‌లో పలు హోదాల్లో విధులు నిర్వర్తించారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా
మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించి గతంలో రైల్వే మంత్రిగా పని చేసిన లలిత్ నారాయణ్ మశ్రా మొదటగా గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయన విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖకు సలహాదారుగా నియామకం అయ్యారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా, 1976 లో అదే శాఖలో కార్యదర్శిగా పని చేశారు. 1980 మధ్య ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా కూడా మన్మోహన్ పని చేశారు. 1982లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చొరవతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా గవర్నర్‌గా నియామితులయ్యారు.
1985 వరకూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా మన్మోహన్ పని చేశారు. ఆ తర్వాత ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్‌లో పలు హోదాల్లో పని చేశారు. ఆ తర్వాత మన్మోహన్ ప్రభుత్వ ప్రతినిధిగా జెనీవాకు వెళ్లారు. చంద్రశేఖర్ ప్రధాన మం త్రిగా ఉన్న సమయంలో తిరిగి ఇండియాకు వచ్చిన మహ్మోహన్.. దేశ ప్రధానికి ఆర్థిక వ్యవహారాలపై సలహాదారుగా పని చేశారు.
మొదటిసారిగా పార్లమెంట్‌కు
మన్మోహన్ సింగ్ 1991లో మొట్టమొదటిసారిగా అస్సాం రాష్ట్రం నుంచి రాజ్యసభ కు ఎన్నికయ్యారు. 1991 మధ్య ఏకంగా ఐదుసార్లు అస్పాం నుంచే ప్రాతినిధ్యం వహించారు. తర్వాత 2019 మధ్య రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1998 మధ్య భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు.
ప్రధానిగా మన్మోహన్ సింగ్
2004 మధ్య దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ పని చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభలో అత్యధిక స్థానాల్లో యూపీఏ కూటమి గెలబడంతో దేశ 13వ ప్రధానిగా మొదటిసారి మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో వాయ్‌పేయ్ ప్రభుత్వం ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజం, హైవే ఆధునీకరణ కార్యక్రమాన్ని మన్మోహన్ ముందు కు తీసుకెళ్లారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలతోపాటు ప్రభుత్వ రంగాల్లో అనేక సంస్కరణలను ఆయన ప్రవేశపెట్టారు.
మన్మోహన్ ప్రభుత్వం రైతులను రుణాల నుంచి ఉపశమనం కల్పించింది. అమ్మకపు పన్ను స్థానంలో విలువ ఆధారిత పన్ను విధానానిన ప్రవేశపెట్టారు. వాటితోపాటు విద్యాహక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సర్వశిక్ష అభియాన్ వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యం గా ఉపా చట్టం, జాతీయ దర్యాప్తు సంస్థల వంటి ఆయన హయాంలో రూపుదిద్దుకున్నాయి. జాతీయ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టాలు ఆయన హయాంలో వచ్చాయి. అయితే ఆయన హయాంలోనే 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం, 2010 కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారీ మొత్తంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.
అందుకున్న అవార్డులు
భారత ప్రభుత్వం 1987లో మన్మోహన్ సింగ్‌ను పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవించింది. మన్మోహన్ ప్రధానిగా పని చేసు ్తన్న సమయంలో 2010లో సౌదీ అరేబియా ఆ దేశ రెండో అత్యన్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్లాజిజ్ అవార్డును ప్రధానం చేసింది. 2014లో జపాన్ ఆ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది పౌలోనియా ఫ్లవర్స్‌ను అందిం చి గౌరవించింది. 1993,1994లో ఉత్తమ ఆర్థిక మం త్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్‌మెన్ అవార్డు, 2017 లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితా లో మన్మోహన్ కు చోటు దక్కింది.
ఆర్థిక మంత్రిగా సంస్కరణలు
ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ దేశాన్ని ఆర్థిక సంక్షభం నుంచి బయటపడేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర నియంత్రణను తగ్గించారు. దిగుమతి పన్నులను కూడా తగ్గించారు. పెట్టుబడి విధానంలో సమూల మార్పులు చేశారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో ఉన్న అనేక అడ్డంకులను తొలగించానికి మన్మోహన్ కృషి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ కూడా ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. మన్మోహన్ ప్రతిభను గుర్తించిన అప్పటి కేబినేట్ మంత్రి పి. చిదంబరం ఆయనను చైనాలోని డెంగ్ జియావోపింగ్‌తో పోల్చారు.
నేడు సెలవు
మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.