10 June, 2026 | 1:32 AM

ధరల పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి

10-06-2026 12:29 AM
  1. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
  2. మహిళా విభాగం ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ  

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా నాలుగుసార్లు పెంచి ప్రజలపై కేంద్రం భారం వేసిందని విమర్శించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్,  డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీభవన్ నుంచి గన్ పార్క్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా స్వర్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై ధరల భారం మోపడం అత్యంత దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి ధరల పెంపు నిదర్శనమన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పులు, ఉప్పుల ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మహిళల ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటాలు ఉధృతం చేస్తామని,  మహిళా శక్తి ఏంటో కేంద్ర ప్రభుత్వానికి చూపిస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర మహిళా కార్యవర్గ కమిటీ సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.