- రైతు భరోసాకు వారి మాటే శిరోధార్యం
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- వనపర్తిలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
- కార్యక్రమంలో నోరు విప్పని ఎమ్మెల్యేలు
- రైతులను బయటే ఉంచి అభిప్రాయాల సేకరణ
వనపర్తి, జూలై 12 (విజయక్రాంతి): రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పంట సాయాన్ని ఏవిధంగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం స్వయంగా రైతుల నుంచి తీసుకోవడానికి క్యాబినెట్ సబ్ కమిటీ అన్నదాతల ముందుకే వచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కమిటీ రైతు భరోసా అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులతో వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో వర్క్‌షాపును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులైన మంత్రులు తుమ్మల, పొంగులెట్టి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ప్రభు త్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికి వ్యవసాయరంగాన్ని కాపాడేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తుందన్నారు. రైతుల నుంచే అభిప్రాయాలు స్వీకరించి విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర వనరులు, సంపదను, ప్రజా సంక్షేమానికి, అభివృద్దికి వినియోగిస్తామన్నారు.
రైతులను రాజు చేయాలనే చిత్తశుద్ధితో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోడానికి ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. వంద ఎకరాల భూస్వాములు, పోరంబోకు, కొండలు, గుట్టలు, లే అవుట్లకు రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేది మీ అభిప్రాయంపైనే ఆధారపడి ఉందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చే నాటికే రూ.8 లక్షల కోట్ల అప్పు ఉందని, అయినా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఆర్థికంగా బలంగా ఉన్న రైతులు స్వచ్ఛందంగా రైతు భరోసాను వదులుకోవాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నా రెడ్డి కోరారు.
జిల్లాల వారిగా అభిప్రాయాలు ఇలా
అత్యధిక మంది రైతులు ఒక కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వాటికి 10 ఎకరాల వరకు రైతు భరోసాను ఇవ్వాలన్నారు. కష్టపడి పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసాను ఇవ్వాలి తప్ప వందల ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు ఎరువులు, యంత్రాలు ఇవ్వాలని రైతు భరోసాతో పాటుగా పంటకు అదనంగా బోనస్ చెల్లించాలన్నారు. రైతులకు కావాల్సిం ది రైతు భరోసా కాదని ప్రధానంగా పంటలను పండించేందుకు సాగునీరు, విద్యుత్‌ను సకాలంలో అందించాలని అప్పుడు రైతులు సాగు సక్రమంగా సాగుతుందన్నారు. కమిటీలో ఇచ్చిన సలహాలు, సూచనలు శాసనసభ లో పెట్టి చర్చించి చట్టసభ ద్వారా తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు.
సబ్ కమిటీలో నోరు విప్పని ఎమ్మెల్యేలు
వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అలంపూర్ ఎమ్మె ల్యే విజేయుడు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరు హాజరయ్యారు. అభిప్రాయాల సేకరణ తరువాత తుమ్మల మాట్లాడుతూ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను ఇక్కడ వ్యక్తపరచాల్సిన అవసరం లేదన్నారు. ఒక అంశానికి బదులు మరో అంశం వస్తుందని, అందువల్ల అసెంబ్లీలోనే మాట్లాడాలని చెప్పడం విడ్డూరంగా మారింది. దీంతో రైతు భరోసా అభిప్రాయ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేలు అందరు అలంకారప్రాయంగా మారారు.
బయట రైతులు.. లోపల నాయకులు
సబ్ కమిటీ అభిప్రాయ సేకరణ గందరగోళంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన రైతులకే పెట్టుబడి సాయాన్ని అందిస్తామం టూ దానిపై గ్రామస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించి ఆ మేరకే నిర్ణయాన్ని ప్రకటిస్తుందంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ, వనపర్తి సమావేశంలో రైతులను బయటే ఉంచి కేవలం కాంగ్రెస్ నాయకులను మాత్రమే లోపలికి పిలిచి అభిప్రాయాలను సేకరించడం గందరగోళానికి దారితీసింది. తమ సమస్యలను అధికారులు, ప్రభుత్వ దృష్టికి చేరవేస్తారని నమ్మకంతో ఉన్న తమను బయటే ఉంచడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.