calender_icon.png 27 December, 2024 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్టరీగానే ముగ్గురి మృతి

27-12-2024 02:31:21 AM

* కామారెడ్డి దవాఖానలో పోస్టుమార్టం

* వివాహేతర సంబంధాలే మరణాలకు కారణమా ?

*  కానిస్టేబుల్‌ది హత్యేనని కుటుంబ సభ్యుల ఆరోపణ

* కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

* పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక వివరాలు వెల్లడిస్తామంటున్న ఎస్పీ

కామారెడ్డి, డిసెంబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువులో భిక్కనూర్ ఎస్సై సాయికుమార్, బీబీ పేట కానిస్టేబుల్ శృతి, జూనియర్ అసిస్టెంట్ నిఖిల్‌కుమార్ మృతదేహాలు లభ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బుధవారం ఉదయం ముగ్గురూ చెరువు ప్రాంతానికి వెళ్లగా, ఆ తర్వాత వారి మరణానికి దారి తీసిన పరిణామాలు మిస్టరీగా మారాయి.

పోలీసులు, రెస్క్యూ బృందం, గజ ఈతగాళ్లు కొన్నిగంటల పాటు చెరువులో గాలించి గురువారం చెరువులో ఎస్సై, కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రధానాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ పరామర్శించారు.

పోలీసులకు అనుమానం వచ్చిందిలా

ఎస్సై సాయికుమార్ స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారం. బీటెక్ చదివిన సాయికుమార్‌ది సాధారణ రైతు కుటుంబం. కొన్నేళ్ల క్రితం సాయికుమార్‌కు వివాహమైంది. భార్య, కుమారుడు ఉన్నారు. 2018లో స్పెషల్‌పార్టీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తర్వాత ఎస్సైగా ఎంపికయ్యాడు. సిద్దిపేట జిల్లా చిన్నకొడూర్ ఎస్సైగా తొలి పోస్టింగ్ తీసుకున్నాడు. తర్వాత కామారెడ్డి జిల్లా బాన్సువాడ, అనంతరం బీబీపేట ఎస్సైగా పనిచేశారు.

అక్కడి నుంచి ఇటీవల భిక్కనూర్‌కు బదలీ అయ్యాడు. బుధవారం ఉదయం 11:30 గంటలకు ఇంట్లో నుంచి సాయికుమార్ బయటకు వెళ్లి, సాయంత్రం తిరిగి వస్తానని పైఅధికారి అనుమతి తీసుకున్నాడు. సాయంత్రమైనా ఎస్సై తిరిగి రాకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువు వద్ద సిగ్నల్‌ను ట్రేస్ చేసి, వెంటనే అక్కడికి వెళ్లి గాలించారు. చెరువు కట్టపై మూడు సెల్‌ఫోన్లు, చెప్పులు లభించాయి.  

ఒకే పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురికి పరిచయం..

మధ్యతరగతి కుటుంబానికి చెందిన శృతి పదేళ్ల క్రితం కానిస్టేబుల్ కొలువు సాధించింది. ఆమె స్వస్థలం గాంధారి మండలం గుర్జల్ గ్రామం. ఐదేళ్ల క్రితం ఆమెకు ఓ వ్యక్తితో వివాహమైంది. తర్వాత అనుకోని కారణాలతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె గాంధారి మండల కేంద్రంలో నివాసం ఉంటూ బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నది. మంగళవారం రాత్రి విధులకు వచ్చిన శృతి బుధవారం ఉదయమైనా ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. శృతి మొబైల్‌కు కాల్ చేసినా ఫలితం లేకపోయింది.

ఇదే రోజు రాత్రి ఆమె ఫోన్‌సిగ్నల్స్ కూడా అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువు వద్దనే ట్రేస్ అయ్యాయి. మరోమృతుడు నిఖిల్‌కుమార్ స్వస్థలం బీబీపేట. ఎంసీఏ చదివిన నిఖిల్‌కుమార్ బీబీ పేటలో విండో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. ఇటీవల జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొందాడు. పెండ్లి కాలేదు. తల్లి  బీడీ కార్మికురాలు.

తండ్రి పదేళ్ల క్రితమే మృతిచెందాడు. కుటుంబానికి ఆధారంగా కుమారుడే ఆధారం. నిఖిల్‌కుమార్ అప్పుడప్పుడు బీబీ పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కంప్యూటర్లకు సంబంధించిన సాంకేతిక సమస్యలు పరిష్కరించేవాడు. ఈ క్రమంలోనే ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతితో పరిచయం ఏర్పడింది. నిఖిల్‌కుమార్ బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి చెరువులో శవమై తేలాడు. తన సోదరుడిని కావాలనే దీనిలో ఇరికించాడని మృతుడి అన్న ఆరోపిస్తున్నాడు.

ఎస్సై సొంత వాహనంలో ఎందుకెళ్లినట్లు..?

ఎస్సై సాయికుమార్ పోలీస్ వాహనాన్ని పక్కనపెట్టి సొంత వాహనంలో ఎందుకు వెళ్లారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కానిస్టేబుల్ శృతి, జూనియర్ అసిస్టెంట్ నిఖిల్‌కుమార్ బీబీపేట, భిక్కనూర్ మండలాల్లో ముగ్గురూ ఒకచోట చేరితే స్థానికులు గుర్తుపడతారని భావించి సదాశివనగర్ మండలంలోని అడ్లూర్‌ఎల్లారెడ్డి పెద్దచెరువు ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు, అక్కడ సుమారు ఆరు గంటల పాటు చర్చలు సాగించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

ముగ్గురు మధ్య విభేదాలు వచ్చాయా? వీరిలో ఎవరిదైనా హత్య? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? విధులు ముగించుకున్న శృతి ఇంటికి వెళ్లకుండా చెరువు వద్దకు ఎందుకు వెళ్లింది? ఎస్సై, జూనియర్ అసిస్టెంట్‌ను ఎక్కడ కలిసింది ? కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ కలిసి ఎస్సై కారులోనే ముగ్గురు వెళ్లారా?  పథకం ప్రకారమే మిగతా ఇద్దరు శృతిని చెరువులో తోసేశారా? లేక ఆమే శృతి ఆత్మహత్య యత్నానికి పాల్పడిందా? ఆమెను కాపాడేందుకే ఎస్సై, జానియర్ అసిస్టెంట్ చెరువులో దూకారా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అంతేలోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.

పోస్టుమార్టం రిపోర్ట్ రావాల్సిందే: ఎస్పీ సింధూశర్మ

ఎస్సై, కానిస్టేబుల్, జూనియర్ అసెస్టింట్ మృతికి సంబంధించిన పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే, వారి మృతికి సంబంధించిన వివరాలు వెల్లడించగలమని ఎస్పీ సింధూశర్మ స్పష్టం చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ముగ్గురి మృతదేహాల పోస్టుమార్టం తర్వాత మీడియాతో మాట్లాడారు.

అనంతరం పోలీస్ బందోబస్తుతో మృతదేహాలను అంబులెన్సుల్లో వారి స్వగ్రామాలకు తరలించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు నాగేశ్వరరావు, శ్రీనివాస్, సీఐలు చంద్రశేఖర్‌రెడ్డి, సంపత్‌కుమార్, సంతోశ్‌కుమార్, ఎస్సైలు ఉన్నారు.