calender_icon.png 30 October, 2024 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలుడి మృతి తీవ్రంగా కలిచివేసింది

18-07-2024 01:22:30 AM

  1. నివారణ చర్యలు తక్షణమే చేపట్టాలి
  2. వీధి కుక్కుల దాడులను అరికట్టాలి
  3. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు 

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): జవహార్‌నగర్‌లో వీధి కుక్కలు దాడి చేసి రెండేళ్ళ బాలుడిని చంపేసిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు ఉన్న అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు.

కుక్కల బెడద ఉన్న ప్రాంతాల నుంచి ఫిర్యాదులు స్వీకరిచేందుకు కాల్ సెంటర్ కానీ టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పసికందుల, చిన్నారులపై ఏటా వీధి కుక్కల దాడులకు వాతావరణ పరిస్థితులు లేదా సీజనల్ అంశాలు కారణమా అనే విషయంపై అధ్యయనానికి పశువైద్యులు, బ్లూక్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయడం లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్‌సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అసుపత్రుల్లో కుక్కలు దాడులకు సంబంధించి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖను సీఎం ఆదేశించారు. ఇలాంటి సంఘటనలను నివారించేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.