calender_icon.png 10 January, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిస్టు నాయకుల మరణం సమాజానికి, ప్రజలకు తీరనిలోటు..

09-01-2025 11:28:01 PM

సంతాప సభలో పలువురు వక్తలు..

ఎమ్మెల్యే కూనంనేని, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ (ఎం) నాయకులు..

ముషీరాబాద్ (విజయక్రాంతి): సమాజ హితం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తూ తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసిన కమ్యూనిస్టు నాయకుల మరణం సమాజానికి, ప్రజలకు తీరనిలోటని పలువురు వక్తలు అన్నారు. నిబద్దత, నిరంతంర ప్రజల కోసం పరితపించే నాయకులను కోల్పోవడం, వారి కుటుంబాల కంటే ప్రజలకు, సమాజానికే ఎక్కువ నష్టమని, ఇటువంటి నాయకులు మళ్లీ రావడం చాలా అరుదు అని అన్నారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. బాలమల్లేష్, ఖమ్మం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యాలయ మాజీ కార్యదర్శి డీఎస్ రామచంద్రారావులకు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో అమరుల సంతాప సభను నిర్వహించారు.

ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎ. కోదండరాం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ లిబరేషన్ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నర్సింహ, వీఎస్ బోస్, ఈటీ నర్సింహ, భాగం హేమంత్ రావు, బాలమల్లేష్ సతీమణి వందన, కుమారుడు నిశంత్, పోటు ప్రసాద్ కుమారుడు సాత్విక్ తదితరులు హాజరైయ్యారు. ముందుకు అమరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా డీహెచ్‌పీఎస్ మహాసభలో మరణించిన ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూవ్ కేరళ నాయకుడు టీఆర్. విజ్జు, మేడ్చల్ జాల్లాలో రొయ్యల కృష్ణమూర్తి మరణం పట్ల సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీల లక్ష్యం, పెద్దలు చేసిన త్యాగాలు, ప్రజల స్థితిగతులు, ప్రజా సమస్యలకు కమ్యూనిస్టు పార్టీ సూచించే పరిష్కార మార్గాలను చూసి మాల మల్లేష్, పోటు ప్రసాద్, రాంచంద్రారావులు కమ్యూనిస్టు నాయకులుగా స్థిరపడ్డారని అన్నారు.

వారు ఎలాంటి ప్రలోభాలకు గురికాలేదని అన్నారు. అనేక అవకాశాలు వచ్చినా పార్టీలోనే కొనసాగారని అన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. పార్టీలో చేరిన మరుసటి రోజే పదవులు కావాలని, ఏదైనా పనులు చేస్తే అందులో ఏమైనా లాబాలున్నాయా అని డబ్బుల చుట్టూ తిరిగే ప్రస్తుత రాజాకీయ పరిస్థితుల్లో డబ్బులే ప్రధానం కాదని, ప్రజలే ప్రధానమని ఆలోచించే కమ్యూనిస్టులు ఉండడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల ఉద్యమం పునరేకీకరణ కావాలని అన్నారు. లేదంటే భవిష్యత్తు ఉండబోదన్నారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు ఏకమవ్వాలని, ప్రజా సమస్యలపైన బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల ముందు పెట్టాలని అన్నారు.