calender_icon.png 26 October, 2024 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి

12-09-2024 12:00:00 AM

రైతాంగ సాయుధ పోరాట ఫలితమే హైదరాబాద్ విలీనం 

సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ 

సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని పార్టీ ఆధ్వర్యంలో కవాతు 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (విజయక్రాంతి)/ముషీరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైందని, ఈ నేపథ్యంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం సీపీఐ హైదరాబాద్ నగర సమితి ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ మగ్దూం మొహినుద్దీన్ విగ్రహం నుంచి లిబర్టీ చౌరస్తా వరకు రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు నిర్వహించారు.

ర్యాలీలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి, పశ్య పద్మ, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో విలీన దినోత్సవాలను అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా జరుపుతుండగా, రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణలో మాత్రం పాలకులు ఎంఐఎం పార్టీ నేతలకు భయపడి తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరపకపోవడం సిగ్గుచేటన్నారు.

అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. 4 వేల మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగానే హైదరాబాద్ సంస్థానానికి నిజాం నుంచి విముక్తి లభించింది తప్పా.. కేంద్ర బలగాలతో కాదన్నారు. అందుకే విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు ముత్యాల యాదిరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బీ వెంకటేశం, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఆంజనేయులు, ప్రజా నాట్య మండలి అధ్యక్షుడు కే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, వివిధ సంఘాల నాయకులు కాంతయ్య, నళిని, ఎన్ శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.