calender_icon.png 10 January, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టిన తేదీ తారుమారైందనీ!

10-01-2025 12:08:43 AM

అనుకోకుండా హీరోయిన్ అయినవాళ్లలో అనన్య నాగళ్ల ఒకరు.  సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వదులుకొని మరీ ఇండస్ట్రీకి వచ్చిందీ అమ్మడు. తొలి చిత్రం ‘మల్లేశం’తోనే ఉత్తమ పరిచయ నటిగా అవార్డు అందుకుంది. ఇప్పుడు వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. అయి తే అనన్య విషయంలో తాజా గా ఓ గమ్మత్తు జరిగింది. జనవరి 8వ తేదీ సాయంత్రం అనన్య నాగళ్లకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ అభిమానులు పెట్టిన మెసేజ్‌లతో ఆమె ఇన్‌స్టా ఖాతా షేకైపోయింది.

అనన్య కూడా ఆ రోజు సాయంత్రం ఒంటరిగానే కేక్ కట్ చేసి తనకు తానే బర్త్‌డే విషెస్ చెప్పుకుంది. ఇదేంటీ..? క్రేజీ హీరోయిన్ ఒకత్తే బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవటమేంటీ..? అనేది చాలా మందికి వచ్చిన ధర్మ సందేహమే. ‘గూగుల్ అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు కూడా చేస్తుందన్న విషయం మీకు తెలిసిందే కదా! నా విషయంలోనూ అదే జరిగింది. నిజానికి 8వ నెల 1వ తేదీన నా పుట్టినరోజు.

అయితే 1వ నెల 8న నా బర్త్‌డే అని గూగుల్‌లో కనిపిస్తోంది. దీంతో అందరూ నాకు ఇన్‌స్టాలో విషెస్ చెప్తున్నారు. వాస్తవానికి మన జీవితంలో ప్రతిరోజూ సెలబ్రేట్ చేసుకునేదే. నా బర్త్‌డే మర్చిపోయి, గూగుల్‌లో కనిపించిన డేట్‌కు నాకు బర్త్‌డే విషెస్ చెప్పినవాళ్ల కోసమైనా ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా. హ్యాపీ బర్త్‌డే టు మీ’ అంటూ కేక్ కట్ చేసింది అనన్య.