జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో రెండు రోజుల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సీఎం కప్, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు, తాహసిల్దార్ లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీలో రాష్ట్రస్థాయిలో వెనుకబడి ఉన్నామని అసహనం వ్యక్తం చేశారు. రానున్న రెండు రోజుల్లో 100% కుటుంబ సర్వే డేటా ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. దానికి గాను డే అండ్ నైట్ షిఫ్ట్ లలో డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలని, అందరూ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు నిరంతరంగా పర్యవేక్షిస్తూ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు ఎంపిక ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం చేపట్టాలని అధికారులను, అర్హులైన నిరుపేదల నుండి దరఖాస్తులను సేకరించాలన్నారు. ప్రతి దరఖాస్తుకు దరఖాస్తుదారుల యొక్క ఫోటో, దరఖాస్తుదారుడు ప్రస్తుతం నివాసముంటున్న గృహం ఫోటో జతపరచాలన్నారు. డిసెంబర్ 4 వరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులు దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 5న తాహసిల్దార్ కార్యాలయం, పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారుల జాబితాను నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. డిసెంబర్ 6న లబ్ధిదారుల జాబితాలో ఏమైనా అభ్యంతరాలు వస్తే విచారణ చేపట్టి నివేదికలు సమర్పించాలన్నారు. డిసెంబర్ 7వ తేదీన లబ్ధిదారుల తుది జాబితాను తాహసిల్దార్లు సిద్ధం చేయాలన్నారు.
రాష్ట్ర క్రీడా శాఖ 36 క్రీడలలో సీఎం కప్ నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా గ్రామ, మండల స్థాయిలో అథ్లెటిక్, ఫుట్ బాల్, వాలీబాల్, కోకో, కబడ్డీ క్రీడలు నిర్వహించేందుకుగాను తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రీడాకారులకు, ఈ సీఎంకు పోటీల నిర్వహణపై విస్తృత స్థాయిలో ప్రచారం, అవగాహన కల్పించాలని ఎంపీడీవోలు పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. ప్రభుత్వం సీఎం కప్ క్రీడలలో పాల్గొనేందుకు గాను క్రీడాకారులు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించిందని కలెక్టర్ తెలిపారు.