calender_icon.png 29 April, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయటపడ్డ చీకటి బాగోతం

28-04-2025 02:13:00 AM

  1. గోదావరిఖనిలోని ఆస్పత్రిలో చీకటి వ్యాపారం 
  2. బట్టబయలు చేసిన జిల్లా వైద్యాధికారిణి
  3. చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడిన ప్రముఖులు?
  4. భయంతో తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి దాక్కున్న అధికారిణి ప్రసన్నకుమారి

పెద్దపల్లి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): గోదావరిఖనిలో ప్రముఖుల చీకటి బాగోతం బయటపడింది. వారంతా సంఘంలో పెద్ద మనుషులు. ప్రాణాలు నిలబెట్టే వైద్య వృత్తిలో ఉన్న వాళ్లు. ఖద్దరు దుస్తులు ధరించిన వారు. శనివారం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని డీఎంహెచ్‌వో డా. అన్న ప్రసన్నకుమారి తనిఖీ చేయగా.. పెద్ద రాద్దాంతమే జరిగింది.

లింగ నిర్ధారణ స్కానింగ్ యంత్రం బయటపడింది. దీంతో సదరు ఆస్పత్రి వైద్యుడికి రామగుండం మాజీ మేయర్, మరో పిల్లల డాక్టర్, స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన మాజీ కార్పొరేటర్లు రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదంతా చూస్తూ పోగైన జనం ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. అసలేం జరుగుతుంది..? అంటూ అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా జనమంతా విస్తుపోయారు.

చివరికి తమ రాజకీయ పలుకుబడి ప్రయోగించి చివరకు డీఎంఅండ్‌హెచ్‌వోపై పోలీసులతో కేసు నమోదు చేయించారు. ఇక చట్టబద్ధంగా తన విధులకు ఆటంకం కలిగించడమే గాకుండా తనను బూతులు తిట్టడంతోపాటు నిషేధిత స్కానింగ్ యంత్రం కలిగి ఉండటం వంటి వాటిపై డీఎంహెచ్‌వో సైతం ఫిర్యాదు చేయగా గోదావరిఖని పోలీసులు మాజీ మేయర్ అనిల్ కుమార్, వైద్యులు డా.నాగిరెడ్డి, క్యాస శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామిలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో గోదావరిఖనిలో అనుమతి లేని ప్రైవేటు దుకాణాల చిట్టా కూడా బయటకు వస్తుండటంతో మిగతా హాస్పిటళ్ల వైద్యులు కంగారు పడుతున్నారు.

అసలేం జరిగింది?

నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా గర్భస్త లింగ నిర్ధారణ స్కానింగ్ యంత్రం ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ అన్న ప్రసన్నకుమారి శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సదరు హాస్పిటల్‌లో తనిఖీ కోసం వెళ్లారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న చిప్పకుర్తి ఆనందంను స్కానింగ్ గది చూపించాలని ఒత్తిడి చేసి గది తాళం పగులగొట్టించి స్కానింగ్ యంత్రాన్ని తహసీల్దార్, పోలీసుల సమక్షంలో సీజ్ చేశారు.

అయితే తనను అవమానించి దౌర్జన్యానికి పాల్పడిందంటూ ఆనందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎంహెచ్‌వోపై వన్-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనపై బెదిరింపులకు పాల్పడటమే గాకుండా విధులకు ఆటంకం కలిగించి అనుమతి లేని స్కానింగ్ యంత్రం కలిగి ఉండి తన డ్యూటీ చేయకుండా అడ్డుకున్నారని డీఎంహెచ్‌వో ఇచ్చిన ఫిర్యాదుతో ఆదివారం రామగుండం మాజీ మేయర్ అనిల్‌కుమార్, ఆస్పత్రి వైద్యులు నాగిరెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ క్యాస శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామిలపై వన్‌టౌన్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. అటు జిల్లా వైద్య ఆరోగ్య  శాఖలోని వైద్యులు, సిబ్బంది విధులు బహిష్కరించి దశలవారీ ఆందోళనలు చేపట్టడానికి మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

నన్ను చంపుతమన్నారు: డీఎంహెచ్‌వో

ఆ హాస్పిటల్‌లో గర్భస్త లింగ నిర్ధారణ ప్కానింగ్ యంత్రం ఉన్నదని వచ్చిన ఫిర్యాదుతో తాను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు తనిఖీ కోసం వెళ్లగా.. అక్కడి వైద్యులు, ఓ మాజీ కార్పొరేటర్ తాము ఎమ్మెల్యే మనుషులమని, ఇక్కడకు ఎందుకు వచ్చావు? చట్టాలు మాకు పని చేయవు? ఇక్కడ నుంచి వెళ్లు అంటూ తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఫ్యాక్షనిస్టుల్లా మీద పడ్డారని డీఎంహెచ్‌వో తెలిపారు. తనను గట్టు వామనరావు లాయర్ల దంపతులను చంపినట్లు చంపుతామని బెదిరించారని ఆరోపించారు. దాంతో తాను భయపడి తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి గంట పాటు అక్కడే తల దాచుకోవాల్సి వచ్చిందని డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి అవేదనతో వివరణ ఇచ్చారు.