- టెండర్లు లేకుండానే అనుయాయులకు కాంట్రాక్టులు
- నాసిరకం పరికరాలు వినియోగం
- 6 నెలల్లోనే రూ.10 లక్షలు కాజేత
- నిమ్మకు నీరెత్తినట్టు పుర అధికారులు
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ మున్సిపాల్టిలో వీధి స్తంభాలకు అమర్చే (ఎల్‌ఈడీ) విద్యుత్ దీపాల మరమ్మతుల పేరుతో కొందరు వ్యక్తులు మున్సిపల్ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. నాసిరకం వస్తువులను వినియోగించి నాణ్యమైన వస్తువుల ధరలతో నకిలీ బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేస్తున్నట్టు ఆరోపనలు వినిపిస్తున్నాయి. లక్షకు పైగా బిల్లులు డ్రా చేయాల్సి వస్తే ఆన్‌లైన్ టెండర్లు పిలవాల్సి ఉండగా, నిబం ధనలకు విరుద్ధంగా మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర పార్టీల అనుయాయులకు విడివిడిగా టేబుల్ టెండర్ల ద్వారా కాంట్రాక్టు కట్టబెట్టి విద్యుత్ దీపాలను రిపేరు చేయిస్తున్నారు. కానీ, వారు నాసిరకం పరికరాలను వాడటంవల్ల ఖజానాకు నష్టంజరుగడంతోపాటు విద్యుత్ దీపాలు మళ్లీమళ్లీ మరమ్మతుకు గురయ్యే అవకాశం ఉందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ శాఖ తీరుపట్ల అసహనం
మున్సిపాలిటీ శాఖపట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పారిశుద్ధ్యం నిర్వహణ, శానిటేషన్, నీటికొరత, క్లోరినేషన్, రోడ్ల మరమ్మతులు, ట్యాక్స్ వసూళ్లు, అక్రమ అనుమతులు, ఆక్రమణలు ఇలా అన్ని అంశాలపై మున్సిపాలిటీ శాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని పలువురు ఆరోపి స్తున్నారు. విద్యుత్ దీపాల మరమ్మతుల పేరిట నకిలీ టెండర్లుతో కాంట్రాక్ట్‌లు అప్పగించి కేవలం ౬ నెలల్లోనే రూ.౧౦ లక్షలు కాజేసినట్టు విమర్షలు వెల్లువెత్తుతున్నాయి. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు అధికారులు, ప్రజాప్రతినిధులు ఖజానాకు గండి కొడుతున్నారు. మున్సిపల్ సమీక్షలో చర్చించి ఆమోదం తెలిపిన, తిరస్కరించిన అంశాలను మినిట్స్ పుస్తకంలో నమోదు చేయకుండా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాసిరకం పరికరాలతో మమ
మున్సిపాల్టి పరిధిలోని వీధి స్తంభాలకు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ విద్యుత్ దీపాల మరమ్మతు కోసం 18 వాట్స్, 35 వాట్స్ సామర్థ్యం గల డ్రైవర్స్, స్ట్రీట్‌లైట్ క్లిప్ ప్లేట్స్ కొనుగోలు కోసం ఒక్కోటి రూ.340 చొప్పున బిల్లులు నమోదు చేశారని తెలిసింది. కాగా, మొత్తం ఎల్‌ఈడీ బల్బ్ సెట్ కొంటే ఇంతకన్నా తక్కువకే దొరుకుతున్నదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటి గురించి పూర్తిగా తెలిసిన విద్యుత్‌శాఖ అధికారులు మిన్నకుండి పోతున్నారు. నకిలీ బిల్లుల ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.