calender_icon.png 27 October, 2024 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టం చిన్నదే!

10-08-2024 01:09:28 AM

సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలడం దురదృష్టకరం

ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించాం

బీఆర్‌ఎస్ హయాంలో దక్షిణంపై వివక్ష

దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదు

నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నల్లగొండ, ఆగస్టు 9 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై పెట్టిన శ్రద్ధ దక్షిణ తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై పెట్టలేదని నీటిపారు దలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పెద్దపూర మండలంలోని సుంకిశాల ప్రాజెక్టులో రిటెయి నింగ్ వాల్ కూలి నీరు చేరిన ఇన్‌టేక్ వెల్‌ను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు.

ప్రాజెక్టు రక్షణ గోడ కూలిపోవడం దురదృష్టకరమని, జరిగిన నష్టం చిన్నదే అయినా ప్రాజెక్టును పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో ఆ నష్టాన్ని కాంట్రాక్టరే భరించాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్బీసీని పూర్తి చేసి ఉంటే హైదరాబాద్‌కు తాగునీరు, నల్లగొండ జిల్లాకు సాగునీరు పుష్కలంగా అందేదన్నారు. నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్బీసీ, డిండి ప్రాజెక్టుల ను పూర్తిచేసేందుకు రాష్ట్రప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్నా వేసవి, వర్షాభావ పరిస్థితుల్లో హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం సుంకి శాల పాజెక్టును చేపట్టిందని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లాకు సాగునీటితోపాటు తాగునీరూ అందించాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎస్‌ఎల్బీసీ పథకాన్ని చేపట్టినా గత ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంతో నష్టం జరిగిందని ఆరోపించారు. 2014 వరకు సుంకి శాల ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో జరగలేదని, 2022 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం రూ.875 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.   

సుంకిశాల వద్ద వరద ఉధృతిని ఇంజినీర్లు అంచనా వేయలేకపోవడం, త్వరగా పూర్తి చేయాలన్న ఆత్రుతే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. రిటెయినింగ్ వాల్ కూలిన ఘటన వెంటనే ప్రభు త్వం దృష్టికి రాలేదని, పత్రికలు, మాధ్యమాల్లో రాగానే తక్షణం విచారణకు ప్రత్యేక కమిటీని నియమించామని వెల్లడించారు. పూర్తి నివేదిక వచ్చిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తుమ్మల పేర్కొన్నారు. వచ్చే ఏడాది వేసవిలోగా సుంకిశాల నుంచి హైదరాబాద్‌కు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

అనంతరం మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ.. ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే నల్లగొండ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని తెలిపారు. అనంతరం సుంకిశాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అధికారులతో కలిసి మంత్రులు తిలకించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, జలమండలి అధికారి అశోక్‌రెడ్డి, డైరెక్టర్ సుదర్శన్, సుంకిశాల ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, నాగార్జునసాగర్ సీఈ నాగేశ్వర్‌రావు, మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, మెఘా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.