calender_icon.png 3 April, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుదీర్ఘ నిరీక్షణకు తెర

18-03-2025 12:00:00 AM

దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకు పోయిన భారత సంతతికి చెంది సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు(భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు) అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగుతారని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రకటించింది.

వారం రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు వెళ్లిన సునీత  తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కుపడడంతో అసలు ఆమె తిరిగి వస్తారా? వస్తే ఆమె ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది? లాంటి అనేక సందేహాలు వచ్చాయి. అయితే వీటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఆమె తిరిగి వస్తుండడం అందరికీ సంతోషాన్నిస్తోంది. 

2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీతా, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లో కొన్ని ప్రయోగాల కోసం బయలుదేరారు. నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం వీరు వారానికే  భూమిని చేరుకోవలసి ఉంది. అయితే స్టార్‌లైనర్‌లో వరస సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది ఖాళీగా భూమికి తిరిగి వచ్చింది.

అప్పటినుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకు పోయారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్స్యూల్ ద్వారా వీరు భూమికి చేరే ప్రక్రియ వేగవంతం అయింది. ఆదివారం ఉదయం డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానం కావడంతో వీరి తిరుగు ప్రయాణానికి సన్నాహా లు మొదలయ్యాయి. 

వాస్తవానికి సునీతా విలియమ్స్‌ను అనుకున్న ప్రకా రం భూమికి తీసుకు రావాలని నాసా అనుకున్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక వాయిదా వేసుకోవలసి వచ్చింది. గతంలో ఇలాంటి సమస్యలు తెత్తినప్పుడు సంభవించిన ప్రమాదాలు కూ డా నాసా తన తన ప్రణాళికను వాయిదా వేసుకోవడానికి కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.

2003 ఫిబ్రవరి 1న నాసా స్పేస్ షటిల్ కొలంబియా భూమి వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో పేలిపోవడంతో భాతీయ వ్యోమగామి కల్పనా చావ్లాతో పాటుగా మరో ఏడుగురు సిబ్బంది కూడా మృతి చెందిన ఘటన ఇప్పటికీ నాసా శాస్త్రవేత్తల మదిలో మొదులుతూనే ఉంది. అలాంటి ప్రమాదం మరోసారి జరక్కుండా ఉండడం కోసం సునీతను భూమికి తీసుకువచ్చే ప్రయత్నాన్ని అది వాయి దా వేసుకున్నట్లు చెబుతున్నారు.

హర్యానాలో జన్మించిన కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ  మహిళగా రికార్డు సృష్టించారు. కాగా సునీత విలియమ్స్‌కన్నా ముందు మరికొందరు వ్యోమగాములు కూడా అనుకోని పరిస్థితుల్లో ఆమెకన్నా ఎక్కువ రోజులు అంతరిక్షంలోనే చిక్కుపడాల్సి వచ్చింది. 1991లో రష్యా వ్యోమగామి సెర్గీ క్రికలేవ్ 311 రోజు పాటు రష్యా ‘మిర్’ స్పేస్ స్టేషన్‌లోనే చిక్కుపడి పోయారు.

ఆయన మిర్ స్పేస్ స్టేషన్‌కు బయలుదేరే సమయానికే యూఎస్‌ఎస్‌ఆర్  కుప్పకూలే పరిస్థితి ఉండింది. దీంతో ఆయన పది నెలలకు పైగా మిర్ స్పేస్ స్టేషన్‌లో ఉండిపోవలసి వచ్చింది. ఆర్థిక సంక్షోభం కారణంగా యూఎస్‌ఎస్‌ఆర్ అంతరిక్ష పరిశోధనా కార్యకలాపాలన్నీ నిలిచిపోవడం దీనికి కారణం.

అలాగే అమెరికా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో కూడా అనుకోని పరిస్థితుల్లో  371 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుపడి పోయి అత్యంత సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడిపిన అమెరికా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. నిజానికి ఆరు నెలల తర్వాత ఆయన భూమికి తిరిగి రావాలి. కానీ ఆయనను తీసుకురావడానికి వెళ్లిన వ్యోమనౌకలో కూలంట్ లీక్ కావడంతో ఆయన అక్కడే ఉండిపోవలసి వచ్చింది.

అంతరిక్ష పరిశోధనల్లో ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురు కావడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నా కాలక్రమంలో వాటినన్నిటినీ అధిగమిస్తారనే ఆశిద్దాం.