మాజీ మంత్రి రామన్న...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రజక కులస్తులకు పెండింగ్ లో ఉన్న కరెంట్ బిల్లును తక్షణం చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రజక సోదరులు కుల వృత్తిలో భాగంగా కొనసాగిస్తున్న ఇస్త్రీ (ల్యాండ్రీ) షాపులపై విద్యుత్ అధికారులు ఒత్తిడికి గురు చేయవద్దని సూచించారు. దసరా మైదానంలో కడదారపు సంటెన్నకు చెందిన ఇస్త్రీ దుకాణం షార్ట్ సర్క్యూట్ ద్వారా కాలిపోవడంతో ఆయనకు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని గురువారం మాజీ మంత్రి అందజేశారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రజక సంఘం సోదరులకు కరెంట్ ఇస్త్రీ పెట్టెలతో పాటు ఉచిత కరెంట్ అందజేసి వారికి ప్రోత్సాహకాన్ని అందజేశామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రజకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి అందాల్సిన ఉచిత కరెంటు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోవడంతో విద్యుత్ అధికారుల వేధింపులకు గురి అవుతున్నారని తెలిపారు. అలాగే వారికి అందాల్సిన ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్, కార్తీక్, రమేష్, అశోక్, భూమన్న, పోశెట్టి పాల్గొన్నారు.