- ఇప్పటికే నర్సరీలో పనులు ప్రారంభం
- 28 లక్షల మొక్కల పెంచడమే లక్ష్యం
పాపన్నపేట, జనవరి 11 : తెలంగాణ వ్యాప్తంగా పచ్చద నాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వనమహో త్సవం కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరుడు మిగిలి ఉన్న మొక్కలతో పాటు కొత్తగా ఆరు నుంచి ఏడు వేల మొక్కలను ప్రతి నర్సరీ లో పెంచేందుకుగాను ఉపాధి హామీ అధికారులు మండలా ల వారీగా లక్ష్యాన్ని విధించారు.
మండలాల వారీగా నిర్ధేశిం చిన లక్ష్యానికి అనుగుణంగా గ్రామ స్థాయిలో నర్సరీల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 2025-26 సంవత్సరానికి గాను 28 లక్షల మొక్కల పెంపకానికి లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటికే దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో 2.5 లక్షల మొక్కల పెంపకానికి బ్యాగు ఫిల్లింగ్ పూర్తి చేశారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 18 లక్షల మొక్కలను నాటడంతోపాటు మిగతా మొక్కల లక్ష్యాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. గ్రామ పంచాయతీ వారిగా నిర్వహించే ఒక్కో నర్సరీకి దాదాపు 2 లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులను వెచ్చించనున్నారు.
ఈత, తాటి మొక్కల పెంపుకు శ్రీకారం...
నర్సరీలో ప్రత్యేకంగా ఈత, తాటి మొక్కలను పెంచేందు కు గాను ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో భాగంగా జిల్లాకు 67,599 ఈత మొక్కలు, 7,511 తాటి మొక్కల పెంపు లక్ష్యానికి మండలానికి 500 చొప్పున పెంచడానికి కేరళ నుంచి ప్రత్యేకంగా తాటి మొక్కలను తీసుకుని వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇవేగాకుండా అటవీ జాతులైన మర్రి, అల్లనేరడి, చింత, రెయిన్ ట్రీ, కానుగ, మద్ది, రావి, వేప, వెలగ, మారేడు, చైనా బాదాంతో పాటు నిమ్మ, జామ, తులసి, మునగ, కరివేపాకుతో పాటు ఇతర మొక్కలను పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం చేస్తున్నాం..
ప్రతి జిల్లాలో ఈత, తాటి మొక్కలను పెంచేందుకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశిం చింది. విత్తనాలకు లక్ష్యానికి అనుగుణం గా సిద్ధం చేశాం. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను మొక్కలను పెంచడంతో పాటు వర్షాకాలం వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం నాటికి అన్ని నర్సరీల్లో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ, మెదక్