calender_icon.png 18 March, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటలు ఎండుతున్నయ్..

15-03-2025 12:00:00 AM

  • సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు
  • ఇందల్వాయి మండలంలో 290 ఎకరాలకు పైగా 
  • ఎండిపోయిన పంటలు రైతులను పలకరించని ప్రజాప్రతినిధులు 

నిజామాబాద్, మార్చి 14 (విజయక్రాంతి) ః సాగునీరు అందక ఎండు ముఖం పడుతున్న పంటలను చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. సాగునీరు లేక పొట్ట దశలోనే తమ పంటలు ఎండిపోతుండడంతో పంటను కాపాడుకోవడానికి రైతులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నాట్లు వేసిన మొదలుకొని పంట సాగుకు ఇప్పటివరకు ఖర్చు చేసిన పెట్టుబడి నష్టపోయే స్థితికి రైతులు చేరుకుంటున్నారు.

జిల్లాలోని వివిధ మండలాల్లో వందల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయాయి. తమ  పంట ఎండు ముఖం పడుతుండడంతో తమకు అందుబాటులో ఉన్న జల వనరులను ఉపయోగించుకోవడానికి రైతులు తమ ప్రయ త్నాలు మొదలుపెట్టారు. ట్యాంకర్ల ద్వారా ఎడ్ల బండ్ల పై నీటిని తెచ్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సాగునీరు అందక ఎండిపోయిన పంటను పశువుల మేతకు వదిలి మిగతా పంటను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రజాప్రతినిధులు పలకరించిన దాఖలాలు జిల్లాలో కనిపించడం లేదు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూ ర్ బోధన్ డివిజన్ లోని రైతులకు సాగు నీటి కష్టాలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి..

మొన్నటి వరకు నిండుగా పోసిన బోర్లు నీరు అందక అడుగంటి పోతుండడంతో పంటలకు నీరు లేక ఎండి పోతున్న పంటలను చూసి తట్టుకోలేని రైతులు పురుగుల మందు డబ్బాలతో పంట పొలాల్లోకి చేరుకొని నీరు ఇస్తారా సచ్చిపొమ్మంటారా అని అధికారులను నిలదీస్తున్నారు.తమ పంటలకు సాగునీరు  అందక పంటలు ఎండిపోతుండడం పంట భూముల లో పగుళ్లు ఏర్పడడం చూసి ఆగ్రహం చెందిన రైతులు నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధిస్తున్నారు.

జిల్లాలో పంటలకు సాగునీరు అందుకుంటే సంబంధిత అధికారులదే బాధ్యత అని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరిస్తున్నప్పటికిని పంటలకు సాగునీరు అందడం లేదు. తమ గ్రామానికి వచ్చిన నీటిపారుదల శాఖ అధికారులను సాలూరు మండలం హుంసా గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో వారిని నిర్బంధించి గదికి తాళం వేశారు.

పంటల ఎండు ముఖం పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీని సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు జిల్లా రైతాంగం నుండి వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అందుబాటులో ఉన్న జల వనరులను వినియోగిం చుకోవాలని డబ్బులు చెల్లించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాంకర్లకయ్యే ఖర్చు వల్ల వచ్చే లాభం పంట సాగుకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువగా ఉండటంతో పశువుల మేతకు తమ పంటలను వదిలేస్తున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో నీతి నిలువలు తగ్గుముఖం పడుతున్నాయి ఫలితంగా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. బోధన్ నవీపేట్ ధర్పల్లి ఇందల్వాయి లో రైతులు వేసిన పంటలు 20 నుంచి 50 ఎకరాలకు పైగా ఎండు ముఖం పట్టినట్టు తెలుస్తోంది. 

ఈ ప్రాంతాల కు చెందిన రైతులు రెండు నుంచి ఐదు ఎకరాలకు పైగా తమ పంటలను నష్టపోయినట్టు అక్కడి పంటలను చూస్తే తెలుస్తోంది..మరికొందరు రైతులు టాంకర్లను అద్దెకు తెచ్చి తమ పంటలకు నీటిని అందించి సాగు చేస్తున్నారు. రైతుల పంట లు రెండు ముఖం పట్టే పరిస్థితి రోజురోజుకు తీవ్రతరమై దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉన్న రైతాం గాన్ని ప్రజా ప్రతినిధులు పలకరించిన పాపాన పోలేదు.

ఇదిలా ఉండగా ఇందల్వాయి మండలంలో 310 ఎకరాలకు పైగా పంట ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అదనపు బోర్లు వేసి టాంకర్ల ద్వారా నీళ్లు పోసి పంటను రక్షించుకునే ప్రయత్నం చేసి ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు.