18-04-2025 12:55:02 AM
ఖమ్మం, ఏప్రిల్ 17 ( విజయక్రాంతి ):-ప్రకృతి రైతుపై పగబట్టింది... అలిమి కాని సమయంలో అవసరం లేని గాలి వానలు అన్నదాతల బతుకును ఛిద్రం చేస్తున్నాయి. ఎన్నో కష్టాలు పడి... నష్టాలు అనుభవించి చేతికి తెచ్చుకున్న పంట సైతం తమ కళ్ళ ముందే అకాల వర్షాలకు తడిసి ముద్దయితే వారి ఆవేధన.. అక్రందనకు అవధూల్లెకుండా పోతోంది.... ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో జరిగిన ఘటన ఎవరినైనా కళ్ళ నీళ్లు పెట్టించక మానదు..మండలంలోని పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య - చంద్రకళ ఇద్దరూ రేయింబవళ్ళు కష్టించి 18 ఎకరాల్లో వరి సాగు చేశారు.వచ్చిన దిగుబడిని ఇంటి వద్ద ఆరబెట్టుకుని అమ్మటానికి కొనుగోలు కేంద్రానికి తీసుకుని వచ్చారు.
కానీ 20రోజులైనా వారి ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయలేదు. దీంతో కేంద్రంలో రాసులుగా పోసి ఉంచిన ధాన్యం మొత్తం ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసిపోయింది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసిన రైతు దంపతులు తడిసిన ధాన్యాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించిన తీరు ప్రజల హృదయాలను కదిలించింది. ‘ ఓరి దేవుడా!.. ఏమిటీ ఘోరం.. ఇలా అయితే ఎలా బతకాలి... కస్టమంతా నీటి పాసలైంది.... ఇక మాకెవురు దిక్కు ‘ అంటూ కన్నీరు మున్నీరయ్యారు.. ఇది చూసిన వారు సైతం కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం.
ధాన్యాన్ని తేగానే కేంద్రం అధికారులు కొన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. కేంద్రం లోని అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు కుటుంబాన్ని చిన్నాభిన్నాం చేసిందంటున్నారు.. ఇది ఈ ఒక్క రైతు సమస్యే కాదు.. ఇలా ఎంతో మంది రైతుల బతుకులు దుర్భరంగా మరాయంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని త్వరగా తేల్చి, బాధిత రైతులను ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన టార్పలిన్లు, గోనె సంచులు,ఇతర పంట రక్షణసామాగ్రిని అందుబాటులో ఉంచాలని రైతులు వేడుకుంటున్నారు.