calender_icon.png 20 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాకు పరీక్ష

01-04-2025 12:00:00 AM

సొంత అభిప్రాయాలు, భావనలు, దృక్కోణాలు ఎవరికైనా ఉండవచ్చు. ఏ దేశంలోనైనా మిలిటరీ పాలన, రాచరిక వ్యవస్థలు వుంటే ఇలాంటివి సాధ్యం కాదు. ఆయా దేశాల విధి విధానాలకు విరుద్ధంగా ఆ దేశ పౌరులు నడుచుకుంటే, అక్కడ అది చెల్లనేరదు. ప్రభుత్వాలు అక్కడ చూస్తూ ఊరుకోవు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇందుకు విరుద్ధం. భావప్రకటనా స్వేచ్ఛకు ప్రజాస్వామ్య దేశాలు పట్టం కట్టినట్టు కనీసం వ్యవహరించాలి. అప్పుడే అలాంటి దేశాలను ప్రజాస్వామ్య దేశాలుగా గుర్తిస్తుంటారు. అమెరికా ప్రజాస్వామ్య దేశం. ఆ దేశం ప్రపంచంలోని మిగతా దేశాల్లో ప్రజాస్వామ్య హక్కులు, మతసహనం మీద ఎప్పుడూ నిఘా ఉంచుతుంది. ప్రతి ఏటా వాటిపై నివేదికలు ఇవ్వడం కూడా కద్దు.

ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ అంశాలు నిజానికి బలంగా పెనవేసుకున్న బంధంలా కనిపిస్తాయి. కాని, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయిన తర్వాత అమెరికాలో పరిస్థితులు దీనికి భిన్నంగా మారాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే ఏ చట్టం చెల్లుబాటు కాదని అమెరికా తన రాజ్యాంగంలో రాసుకుంది. ఇది చాలా స్పష్టమే. కాని, తమ విదేశాంగ విధానానికి అనుగుణంగానే తమ గడ్డపై ఎవరైనా మసలు కోవాలనేది అమెరికా నిగూఢ నీతి. గాజా పలస్తినీయుల పట్ల సానుభూతి చూపిన విదేశీ విద్యార్థుల పట్ల ట్రంప్ సర్కారు చూపుతున్న ధోరణి ఇందుకు నిదర్శనం. రంజనీ శ్రీనివాసన్, మొహమ్మద్ ఖలీల్ తదితర విద్యార్థులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

వారంతా పలస్తీనా పట్ల నిర్దుష్ట అభిప్రాయా లు వ్యక్తం చేయడమే నేరమైంది. హమాస్‌కు సీనియర్ సలహాదారుగా వున్న ఒకాయన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని భారతీయ విద్యార్థి బాదర్ ఖాన్ సూరిని కూడా స్వచ్ఛందంగా అమెరికా విడిచి వెళ్లాలని ఈ మెయిల్‌లో హుకుం జారీ చేసింది ట్రంప్ సర్కారు. తమ యూనివర్సిటీ క్యాంప స్‌లో ఇలాంటి ‘కార్యకలాపాలు’ చెల్లనేరవని స్పష్టం చేసింది. ఇలాంటి కార్యకలాపాలు అంటే ఏమిటి? ‘మేం వ్యతిరేకించే హమాస్‌కు మద్దతుగా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దు. క్యాంపస్‌లో ప్రదర్శనను చేపట్టరాదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏళ్ల తరబడి రక్తమోడుతున్న పలస్తినీయులకు సంఘీ భావం తెలుపవద్దు.’ ఇదీ ట్రంప్ సర్కారు తీరు.

శ్రీనివాసన్ మార్చి 11న కెనడాకు స్వచ్ఛందంగా అమెరికా నుంచి వెళ్లిపోయాడు. ‘మానవ హక్కులకు మద్దతుగా నిలబడటం అంటే, హమాస్‌కు మద్దతు నివ్వడంగానే చూస్తున్నారు. ఇలా ఎవరినైనా ప్రశ్నించవచ్చు’నని శ్రీనివాసన్ అల్ జజీరాకు చెప్పారు. ‘ఇది అమెరికా గడ్డపై భావ ప్రకటనా స్వేచ్ఛను హరించినట్టు కాదా?’ అంటే ప్రజాస్వామ్య వాదులు ‘అవున’నే అంటారు.

ఇలా తమ విధానాలకు విరుద్ధంగా భావాలు వ్యక్తంచేస్తున్న వారు దేశం విడిచి వెళ్లేటట్టు చేయడం అమెరికా ప్రభుత్వానికి ఇప్పుడు కొట్టిన పిండిగా మారింది. నిజానికి ఇంటా ‘దేశ బహిష్కరణ’లను అక్కడి కోర్టులు వ్యతిరేకిస్తున్నాయి కూడా. అయితే వాటి స్వరం అంత బలంగా లేకపోవడం ప్రభుత్వానికి కలిసి వస్తోంది. ప్రపంచానికి ప్రజాస్వామ్య దిక్సూచి అని, మానవ హక్కులకు చిరునామా అని కీర్తి గడించిన అమెరికా ఈ విషయంలో తన డొల్లతనాన్ని బయట పెట్టుకుంటున్నదని విశ్లేషకులు అంటు న్నారు.

అమెరికాలోనే కాదు, భారత్‌లోకూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. నిజానికి విదేశీ విద్యార్థులు ఏదైనా నిరసనలో పాల్గొంటే అది దేశ భద్రతకే ముప్పుగా భావించే పరిస్థితి. ఐదేళ్ల క్రితం సీఏఏకు వ్యతి రేకంగా దేశంలో చాలాచోట్ల ప్రదర్శనలు జరిగాయి. అప్పుడు ఆ నిరసన ల్లో పాల్గొన్నందుకు జర్మనీకి చెందిన ఐఐటీ మద్రాస్ విద్యార్థిని ఇంటికి పంపిన ఘటన ఇలాంటిదే. కాల పరీక్షలకు నిలబడి రాటుదేలినప్పుడే కదా నిజం అనేది ప్రస్ఫుటమవుతుంది.