calender_icon.png 6 October, 2024 | 1:59 PM

గోరక్షకులను గూండాలుగా చూస్తున్నారు

06-10-2024 01:56:04 AM

దేశంలో ఈ వైఖరి మారాలి

గోవును రాజ్యమాతగా గుర్తించాల్సిన అవసరముంది

జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి

రాంచీలో గోధ్వజ్ స్థాపన చేసిన స్వామీజీ

రాంచీ (జార్ఖండ్), అక్టోబర్ 5: గోవును మాతగా పిలవడంలో సందేహం ఎందుకని, అమ్మలా పూజిస్తే గోమాత ఆశీర్వాదం లభిస్తుందని జ్మోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి స్వామీజీ ఉద్ఘాటించారు.

గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా జార్ఖండ్ రాజధాని రాంచీలో రాణిసతీ ఆలయ ప్రాంగణంలో స్వామీజీ గోప్రతి ష్ఠ జెండాను శనివారం స్థాపించారు. ఈ సం దర్భంగా శంకరాచార్య స్వామీజీకి భక్తులు పాదుక పూజ చేశారు. అనంతరం స్వామీజీ భక్తబృందాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గో సంరక్షులను ఈ దేశంలో గూండాలుగా చూస్తున్నారని, ఈ రకమైన వైఖరి మార్చుకోవాల్సిన అవసరముందన్నారు. 

జన్మనివ్వకపోయినా..

మనకు జన్మను ఇవ్వకపోయినప్పటికీ గోవు మన జీవితాలతో ముడిపడి ఉంది. అందుకే గర్వంగా గోవుకు రాజ్యమాత హోదా ఇవ్వాలి. మనం విశ్వసించే సనాతన ధర్మం వృషభ రూపంలో ఉంటుంది. వృషభానికి తల్లి ఆవు. కాబట్టి మనమంతా గోమాత బిడ్డలమే. ప్రస్తుతం అధికారికంగా గోవును రాజ్యమాతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. దేశంలో గోహత్య కళంకాన్ని అంతం చేయాల్సిన సమయం వచ్చింది.

దేశంలో ఆవును సేవించినంత కాలం సుఖశాంతులు, సౌభాగ్యాలు ఉండేవి. గోసేవకు దూరమయ్యాక మన జీవితాలు మసకబారాయి. వేదాల ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకుని గోసేవ పట్ల మీ బాధ్యతను నిర్వర్తిం చడం అవసరం. కాబట్టి హిందూసమాజం మొత్తం ఈ అంశాన్ని పాటించాలి. గోమాత అనుగ్రహం పొందాలి అని శంకరాచార్య స్వామీజీ పిలుపునిచ్చారు. 

మంత్రికి అభినందన

గోధ్వజ స్థాపన కార్యక్రమంలో జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో స్వర్ణరేఖ నది ప్రక్షాళన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని శంకరాచార్య స్వామీజీకి వివరించారు. ఈ మేరకు మం త్రిని అభినందించిన స్వామీజీ..

సహజ వనరులైన నది, అడవులు మొదలైన వాటి పరిరక్షించాల్సిన అవసరముందని సందేశం ఇచ్చారు. రాంచీలో కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి ఒడిశా మయూర్‌భంజ్ జిల్లాలోని కరాంజియా కు స్వామీజీ చేరుకున్నారు. ఆదివారం భువనేశ్వర్‌లో గోప్రతిష్ఠ ధ్వజాన్ని శంకరాచార్య స్వామీజీ స్థాపిస్తారు.