calender_icon.png 17 January, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల గణనపై కోర్టు తీర్పు హర్షణీయం

11-09-2024 12:39:28 AM

బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా న్యాయం 

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు

హైదరాబాద్,సెప్టెంబర్ ౧౦ (విజయక్రాంతి): కుల గణనను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు తీర్పునివ్వడం పట్ల పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు హర్షం వ్యక్తంచేశారు. కుల గణనపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారని, రూ.150 కోట్లు  కేటాయించడంతోపాటు బీసీ కమిషన్‌ను కూడా నియమించారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను కేసీఆర్.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి ఇవ్వాలన్నారు.

కోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు కంటే ఒక నెల ముందే కుల గణన పూర్తి కావడానికి అవకాశం ఉందని చెప్పారు. కుల గణన జరిగిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు రాజకీయంగా మంచి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కుల గణన చేయాలని చెప్తున్నారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ కుల గణనపై ధర్నాలు చేయడం కాదని, బీఆర్‌ఎస్ హయాంలో చేసిన సర్వేను సీఎస్‌కు పంపాలని సూచించారు. కుల గణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే  కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వస్తాయని, తద్వారా గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ది చెందుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కుల గణనకు తెలంగాణ, తమిళనాడు, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.