- కుటుంబ కలహాలతో ఒకరు.. అప్పుల బాధతో మరొకరు?
- కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య
- సిద్దిపేటలో భార్య, పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న కానిస్టేబుల్
- ఆత్మస్థుర్యైన్ని కోల్పోతున్న పోలీసులు
- పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో మనస్తాపం?
- కలవరం రేపుతున్న పోలీసుల ఆత్మహత్యలు
ఇద్దరు పోలీసుల బలవన్మరణం
మెదక్/సిద్దిపేట/కామారెడ్డి, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పోలీసు శాఖలో ఎస్సైల నుంచి మొదలుకుని కానిస్టేబుళ్ల వరకు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒకేరోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం ఆ శాఖను కలవర పెడుతున్నది.
పోలీసులంటే ధైర్యానికి, ఆత్మస్థు గుండె నిబ్బరకు నిలువుటద్దంగా చెప్పుకుంటారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ తప్పు చేసేవారికి గుబులు పుట్టించే ఖాకీల జీవితాల్లో కన్నీటి వ్యథలు ఉన్నాయి. పైకి నిబ్బంరంగా కనిపిస్తున్నా వారిలో సైతం ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతున్నది.
కాఠిన్యం వెనుక కన్నీటి వ్యథలు ఉంటాయని, కష్టం వచ్చినప్పుడు సామాన్యుడిలాగే గుండె జారిపోతుందని ఇటీవల జరుగుతున్న ఆత్మహత్యలే నిదర్శనం.
ఈ నెల 25న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్‌ఎల్లారెడ్డి పెద్ద చెరువులో భిక్కనూర్ ఎస్సై సాయికుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతిల ఆత్మహత్యలు మర్చిపోకముందే ఆదివారం మెదక్ జిల్లా కొల్చారం పోలీస్‌స్టేషన్ పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలను చూస్తుంటే పోలీసుల్లో ఆత్మసైర్థ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తుంది.
టార్గెట్ పెట్టి విధులు
ఉన్నతాధికారులు పోలీసులకు ముందురోజే అసైన్‌మెంట్ అప్పగిస్తున్నారు. పనికి టార్గెట్ పెట్టి విధులు నిర్వహిస్తుండటంతో పోలీసులు పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులు అప్పగించిన టాస్క్‌ను పూర్తి చేయాలనే ఆలోచన తప్ప తమ కుటుంబ సభ్యుల యోగా క్షేమాలను పట్టించుకోవడం లేదు.
కిందిస్థాయి అధికారులు, సిబ్బంది కుటుంబాల ఇబ్బందులను తెలిసి కూడా సెలవు ఇవ్వలేని పరిస్థితి పోలీస్‌శాఖలో నెలకొంది. దీంతోనే విధుల్లో బిజీగా గడిపే పోలీసులు అభద్రతా భావంతో మెలుగుతున్నారు. దీంతో ఉన్నతాధికారులను ఎదిరించలేక కుటుంబాలకు సరైన న్యాయం చేయలేక మనోవేదన అనుభవిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పెరిగిన పని ఒత్తిడి?
పోలీస్‌శాఖలో పని ఒత్తిడి పెరగడంతోపాటు ఉన్నతాధికారులు చెప్పినట్లు పనిచేయాల్సి వస్తున్నది. మరోవైపు కుటుంబంతో సరిగా గడపకపోవడంతో సమస్యలు ఎక్కువై పోలీసులు కుంగిపోతున్నారు. ఉన్నతాధికారులకు తమ బాధలను చెప్పుకునే వీలు లేక కిందిస్థాయి సిబ్బంది సతమతమవుతున్నారు.
దీంతో కుటుంబ సభ్యులకు సరైన న్యాయం చేయలేక ఉన్నతాధికారులు చెప్పిన పనులను చేసుకుంటూ మనోవేదన చెందుతున్నారు. విధుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఉన్నతాధికారులు పనిష్మెంట్ కింద మెమోలు జారీ చేస్తున్నారు. దీంతో ఇంక్రిమెంట్లు కట్ అవుతూ విధులు నిర్వహించినా కోత విధిస్తున్నారు.
ఉన్నతాధికారుల కింద పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో భాగంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరోవైపు ట్రాపిక్ డ్యూటీలు, ఉన్నతాధికారుల అసైన్డ్‌మెంట్‌లు పోలీస్‌లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బంధువుల శుభకార్యాలకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
పోలీసులకు యోగా నేర్పాలి
పోలీస్‌శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి యోగా తప్పనిసరి చేయాలి. యోగాతో విధుల టెన్షన్ తగ్గుతుంది. అలాగే పనిభారాన్ని తగ్గించాలి. టెన్షన్‌తో విధులు నిర్వహించడం వల్ల నరాల్లో ఉత్తేజం తగ్గి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఏర్పడుతుంది. పోలీస్ శాఖ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇస్తే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే సమయం దొరికి మానసిక ఆందోళన నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది.
మల్లికార్జున్, మనోవికాస వైద్యుడు, కామారెడ్డి