calender_icon.png 13 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రియాంకాగాంధీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం

12-01-2025 11:21:02 PM

ప్రియాంకాగాంధీ జన్మదిన వేడుకల్లో ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి...

ఖమ్మం (విజయక్రాంతి): ఎంపీ ప్రియాంకాగాంధీ జన్మదిన వేడుకల సందర్బంగా ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్లు పంచుకుని, సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి మాట్లాడుతూ... ప్రియాంకాగాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గొప్ప విజన్ ఉన్న నాయకురాలు ప్రియాంకాగాంధీ అని, ఎంతో ముందు చూపున్న నాయకురాలని కొనియాడారు. ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమన్నారు. భారత్ జోడోయాత్ర, భారత్ న్యాయ యాత్రతో దేశం అంతటా పర్యటించి, ప్రజా సమస్యలు తెలుసుకున్న నాయకురాలని అన్నారు. పార్లమెంట్‌లో అధికారపక్షాన్ని ధీటుగా ఎదుర్కొంటూ, ప్రజా వ్యతిరేక విధానాలపై కేంద్రాన్ని ఎండగట్టడంలో ఆమె దిట్ట అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్‌గాంధీకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలకు మరెన్నో సేవలు అందిస్తూ ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, ఎంపీ క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి చంద్రశేఖర్, దొబ్బల సౌజన్య, కొత్తా సీతారాములు, సయ్యద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.