- పత్తి రైతుకు మద్దతు ధర కరువు
- ఇంకా చాలా చోట్ల ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు
- ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్న అన్నదాతలు
- తేమ శాతం సాకుతో 6,500లకే కొనుగోలు
- మద్దతు ధరకంటే తక్కువ కొనడంపై రైతుల ఆందోళన
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): వర్షాలు, చీడ పురుగులు ఎదుర్కొని పత్తి పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితి లేదు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు కొన్ని జిల్లాలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీంతో కేంద్రాలు లేని జిల్లాలో రైతులు పత్తిని ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకునే దుస్థితి వచ్చింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు తేమ శాతం పేరుతో తక్కువగా ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను నిండి ముంచుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,521 ఉండగా వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రూ. 6,500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
వ్యాపారుల చేతుల్లో రైతులు మోసపోతున్నా సీసీఐ ప్రేక్షక పాత్ర వహిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తిలో 8 నుంచి 12 శాతం తేమ రాదని తెలిసినా తేమ శాతాన్ని పెంచేందుకు సీసీఐ నిబంధనలు ఒప్పకోవని అధికారులు చేతులేత్తుశారు. దీంతో వ్యాపారులు రైతుల కష్టాన్ని ఇష్టాను సారంగా దోచుకుంటున్నారు.
10 వేలకు కొనుగోలు చేయాలి..
ఈ సంవత్సరం వర్షాలను తట్టుకుని పత్తి పంట తీస్తే అమ్మే సమయానికి తక్కువ ధర పలకడం తమకు ఎంతో ఆందోళన కలిగిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం 18నుంచి 23 శాతం వస్తుందని సాకు చూపించి రూ. 6,500లకు కొనుగోలు చేయడంతో నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. అప్పులు చేసి పంట పండిస్తే చివరకు గిట్టుబాటు ధర దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పత్తి రైతుల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించి పత్తి సులభంగా కొనుగోలు చేసేలా చూడాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 10 వేలకు కొనుగోలు చేస్తే లాభం రాకున్నా నష్టాల నుంచి బయటపడుతామని పేర్కొంటున్నారు. అదే విధంగా తేమ శాతం 15 శాతం నుంచి 18 శాతం వరకు నిర్ణయించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గ్రామాల్లో దళారుల దగా..
మరోవైపు గ్రామాల్లోను దళారులు అక్రమంగా పత్తి కొనుగోలు చేస్తూ తిరిగి మార్కెట్‌లో అదే పత్తిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 42.23లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా ప్రభుత్వం 25.33లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. దానికి తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని స్థానిక అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు.
అయితే దీపావళి తరువాత పత్తి పెద్దమొత్తంలో కేంద్రాలకు వస్తుందని భావిస్తూ నెమ్మదిగా కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. ముందుగా పత్తి సాగు చేసిన రైతులు దసరా నుంచి పత్తి పంట అమ్మేందుకు సిద్ధమయ్యారు. గత వారం రోజుల నుంచి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డిలో సీసీఐ కేంద్రాలు తెరిచింది.