calender_icon.png 25 October, 2024 | 3:55 AM

బాలిక ప్రాణం ఖరీదు 13.5 లక్షలు

25-10-2024 01:07:03 AM

  1. పేదరాలి ప్రాణానికి పెద్దోడి సెటిల్‌మెంట్ 
  2. మృతురాలి బంధువులకు లీడర్ల బెదిరింపులు
  3. దొంగతనం నెపానికి బలైన బాలిక 

గద్వాల ( వనపర్తి), అక్టోబర్ 24 ( విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక ఆత్మహత్య కేసులో పొలిటికల్ లీడర్లు రంగ ప్రవేశం చేసి బాలిక ప్రాణానికి ఖరీదు కట్టారు. తమ పరపతిని ప్రదర్శిస్తూ బాలిక ప్రాణాన్ని రూ.13.50 లక్షలకు వెలకట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో బాలిక రాజేశ్వరి (16) ఓ వ్యాపారి ఇంట్లో పనికి కుదిరింది. బాలికతో సదరు వ్యాపారి కుటుంబం వెట్టి చాకిరీ చేయించుకున్నది. ఈ క్రమంలో ఇంట్లో బంగారం పోయిందని ఓ రోజు బాలికపై వ్యాపారి అభియోగం మోపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చేయని తప్పుకు విచారణ పేరుతో బాలికను పోలీసులు పీఎస్‌కు పిలిచి వేధించారు.

దీంతో ఆ అవమాన భారం భరించలేక మానసిక క్షోభకు గురై చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ వివరాలను ‘విజయక్రాంతి’ దినపత్రిక వెలుగులోకి తేవడంతో ఎట్టకేలకు పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. సదురు వ్యాపారిపై కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు.

ఎలాంటి ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ నమోదు కాకుండానే బాలిక అని చూడకుండా నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నడిగడ్డ వాసులు ప్రశ్నిస్తున్నారు. చివరికి బాలిక ప్రాణం పోయాక ప్రాణం ఖరీదుకు వెలకడుతూ బేరసారాలకు దిగేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరగడంతో సభ్యసమాజం తలదించుకుంటుంది.

బాధితుల పక్షాన నిలబడాల్సిన ఓ ప్రజాప్రతినిధి కూడా నిందితుడికి అండగా నిలిచి మృతురాలి బంధువులను బెదిరించి బాలిక ప్రాణానికి వెలకట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీస్ అధికారులు కూడా ఆ బిడ్డ ప్రాణం పోయేందుకు కారణమయ్యారు. అయితే బాలిక మరణానికి కారణమైన వ్యాపారిపై పోలీ సులు చర్యలు తీసుకోవాల్సిందేనని, లేదంటే న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రజాసంఘాలు హెచ్చరించాయి.