కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కావ్య
వరంగల్, మే 11 (విజయక్రాంతి): వర్ధన్నపేటలో భూములు, చెరువులు, గుట్టలు మింగి అవినీతి, అక్రమాలతో ఎదిగి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆరూరి రమేష్‌కు ప్రజలు ఓట్లతోనే బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కావ్య పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరిన కాంగ్రెస్ జెండా ఈసారి ఢిల్లీలోనూ ఎగురుతుందన్నారు. పదేళ్ల పాలనలో బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.
ప్రధాని మోదీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ సిలిండర్, డీజిల్, పెట్రోల్ ధరలు అమాంతం పెరిగాయన్నారు. దీంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. పేదల కష్టాలు తెలిసిన కాంగ్రెస్ ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రచారంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొన్నారు.