calender_icon.png 19 April, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినోదం తెచ్చిన వివాదం

26-03-2025 12:00:00 AM

ప్రేక్షకులను నవ్వించేందుకు రూపొందించిన ఓ వినోద కార్యక్ర మం ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రసిద్ధ కమెడియన్ కునాల్ కమ్రా ఇటీవల ముంబయిలోని యూనికాంటినెంటల్ హోటల్‌లో ఓ హాస్య వినోద కార్యక్రమం రూపొందించి దాన్ని రికార్డు చేశారు. అందులో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను ‘గద్దార్’ (ద్రోహి)గా అభివర్ణిస్తూ ఓ హిందీ సినిమాలో పాటకు పేరడిని కమ్రా పాడడం ఈ వివాదానికి కారణమయింది.

ఉద్ధవ్ థాక్రే శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ‘కమ్రా కా కమాల్’ పేరుతో దాన్ని అప్‌లోడ్ చేయడం అగ్నికి ఆజ్యం పోసింది. ఉపముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కమ్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షిండే మద్దతుదారులు హాబిటాట్ హోటల్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై 40 మంది శివసేన కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ దాడితో తమ హోటల్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హాబిటాట్ హోటల్ యాజమాన్యం ప్రకటించింది. అక్కడినుంచి ఈ ఉదంతం మరో మలుపు తిరిగిం ది. షిండేను అవమానించినందుకు కమ్రా క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్న అర్బన్ నక్సలైట్లకు, వామపక్ష ఉదారవాదులకు తగి న గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.

వాక్ స్వాతంత్య్రం ఉందని ఏది పడితే అది మాట్లాడితే చట్టం ఊరుకోబోదని, కమ్రా చట్టప్రకారం శిక్షను అనుభవించక తప్పదనే వ్యాఖ్యలు అధికార మహాయుతి కూటమి నేతలనుంచి వినిపిస్తున్నాయి. అయితే తాను ఎలాంటి క్షమాపణలు చెప్పబోనని, ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రం క్షమాపణలు చెబుతానని కమ్రా స్పష్టం చేశారు. కమ్రాకు కాంగ్రెస్,  శివసేన ఉద్ధవ్ వర్గం మద్దతుగా నిలుస్తున్నాయి.

కమ్రా నిజమే మాట్లాడారని, వ్యంగ్యం ఆయన స్టుల్ అని ఆపార్టీలు వాదిస్తున్నాయి. దీంతో ఈ వివాదం భావప్రకటనా స్వేచ్ఛపై చర్చగా మారుతోంది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది అందరికీ సమానం కాదా అని కమ్రాను సమర్థిస్తున్న వారు ప్రశ్నించారు. గతంలో చాలామంది నేతలు ప్రత్యర్థులపై ఇంతకన్నా దారుణమైన వ్యాఖ్యలు చేశారని, అప్పుడు వారికి ఇవేవీ గుర్తుకు రాలేదా అని కూడా వారు నిలదీస్తున్నారు. 

కాగా ముంబయిలో పుట్టిపెరిగిన కమ్రా వివాదాల్లో చిక్కుకోవడం కొత్తే మీ కాదు. గతంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేలాంటి పలువురు ప్రముఖులపై ఇలాం టి వ్యంగ్య వ్యాఖ్యలు కారణంగా కోర్టు ధిక్కరణ కేసులు, వివాదాలను ఎదుర్కొన్నారు. అన్నిటికీ మించి 2020లో జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి తో విమానంలో గొడవపడ్డం తీవ్ర దుమారం రేపింది.

ఈ ఘటనతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆయనపై ఆరు నెలల నిషేధం విధించగా, ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌లాంటి ఇతర ఎయిర్‌లైన్స్ నిరవధికంగా నిషేధం విధించాయి. అయినా ఆయన తన పద్ధతి ఏమీ మార్చుకోలేదు. కామెడీ షోలు నిర్వహిస్తూనే వస్తున్నారు. ఒక ప్రజా నాయకుడిపై తాను వేసిన జోక్‌ను హుందాగా తీసుకోలేని రాజకీయ నాయకుల అసమర్థత తన హక్కును, స్వభావాన్ని మార్చలేదని కమ్రా స్పష్టం చేశారు.

తనకు తెలిసినంత వరకు మన నాయకులను, సర్కస్ లాంటి రాజకీయ వ్యవస్థను అప హాస్యం చేయడం చట్టవ్యతిరేకం కాదనేది ఆయన వాదన. వాక్ స్వాతం త్య్రం, భావప్రకటనా స్వేచ్ఛ కేవలం ధనవంతులు, శక్తివంతులకు మాత్రమే కాదనేది ఆయన అభిప్రాయం.

అయితే రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులపై గతంలో ఇంతకుమించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయ ని, అప్పుడు పట్టించుకోని వాళ్లు ఇప్పుడు ఓ కామెడీ షోలో వ్యంగ్యాన్ని మాత్రం ఎందుకు భరించలేక పోతున్నారనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. అయినా ఇలాంటి వాటిని హుందాగా తీసుకుంటే ఎలాంటి గొడవా ఉండదు. కోర్టు జోక్యం చేసుకుని దీనిపై స్పష్టత ఇస్తే తప్ప ఇది ఇప్పట్లో చల్లారక పోవచ్చు.