calender_icon.png 18 November, 2024 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్పీసీఐఎల్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

18-11-2024 04:18:22 PM

ఎన్పీసీఐఎల్ కాంట్రాక్టర్ పై లేబర్ కమీషనర్ కు ఏఐటీయూసీ ఫిర్యాదు : సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. ఎస్ బోస్

కాప్రా (విజయక్రాంతి): న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడంతో ఏఐటీయూసీ కాప్రా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని ఎన్పీసీఐఎల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ మాట్లాడుతూ.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్) లో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్న కాంట్రాక్టర్ తీరు అప్రజాస్వామికమని అన్నారు.

ఈ విషయంపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. కార్మికుల పట్ల ఎన్పీసీఐఎల్ అధికార యంత్రాంగం ఉదాసీనత వ్యక్తం చేయాలని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. తొలగించిన కార్మికులను సత్వరమే విధుల్లోకి తీసుకోవాలని, వారికి పనిచేసిన జీత భత్యాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం చేసే వరకు ఏఐటీయూసీ పక్షాన నిరంతరం పోరాటం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ.దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎస్.శంకర్రావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర, జిల్లా ఏఐవైఎఫ్ కార్యదర్శి సత్యప్రసాద్, ఏఐటీయూసీ నేతలు నారా నర్సింహ, లక్ష్మీ నారాయణ, నర్సింహా రావు, స్వామిదాస్, లక్ష్మణ్లతో పాటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.