calender_icon.png 16 March, 2025 | 8:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగదారుడు తన హక్కును తెలుసుకోవాలి

15-03-2025 11:14:19 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రతి వినియోగదారుడు తన హక్కులను తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు  శ్రీనివాస్ రావు, హరికృష్ణ, ఇంచార్జ్ జిల్లా పౌర సరఫరాల అధికారి వేణుగోపాల్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతిలతో కలిసి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పెట్రోలియం సంస్థలు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు, రేషన్ డీలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 'స్థిరమైన జీవన విధానానికి న్యాయమైన పరివర్తన - మార్పు' అనే అంశంపై ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2025 నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఆన్ లైన్ లో వస్తువుల కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుడు ఎంపిక చేసుకున్న వస్తువు కాకుండా దెబ్బతిన్నది, వేరేది, మోసపూరితమైన వస్తువులు వచ్చినప్పుడు సంబంధిత ఆన్లైన్ సంస్థ పోర్టల్లో వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందని, పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలని సూచించారు. బ్యాంకింగ్ రంగంలో ఆయా బ్యాంక్ శాఖలలో ఖాతా కలిగి ఉన్న వినియోగదారులు నగదు లావాదేవీల విషయంలో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. హోటళ్ళు, రెస్టారెంట్లలో తినేందుకు వెళ్ళినప్పుడు వినియోగదారులకు అందించే ఆహారం నాణ్యతగా లేకపోయినా, ఆహారం తయారీలో సరైన నిత్యావసరాలు వినియోగించకపోయినా, సరైన ఆహారం అందించకపోయినా ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజలు తమ ఆరోగ్య అవసరాల కొరకు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు సరైన వైద్య సేవలు అందించకపోయినా, వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందుల షాపులో మందులు ఇవ్వకపోయినా మెడికల్ బోర్డ్, డ్రగ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

మార్కెట్లో వివిధ వ్యాపార సంస్థల ద్వారా విక్రయించబడే వస్తువులు, సరుకులపై ముద్రించే కాలపరిమితికి సంబంధించి కొనుగోలు సమయంలో వినియోగదారులు పరిశీలించుకోవాలని, కాలపరిమితి ముగిసిన వాటిని విక్రయించినట్లయితే వాటి వలన కలిగే నష్టాలు, తీసుకోవలసిన చర్యలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఉంటున్నందున వినియోగదారుల హక్కులు, వినియోగదారుల కోర్టు వివరాలతో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్, రాజయ్యతో కలిసి వినియోగదారుల హక్కుల సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.