21-02-2025 12:00:00 AM
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
సంగారెడ్డి, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారా నగర్ లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డు నిర్మాణం పనులు వెంటనే నిలిపివేయాలి కలెక్టరేట్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్యానగర్లో జీహెచ్‌ఎంసీ నిర్మాణం చేస్తున్న డంపింగ్ యార్డ్ను రద్దు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆలోచించాలని, ప్రజా ఉద్యమాలను నిర్బందాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ గుమ్మడిదల, నల్లవల్లి, ప్యారానగర్ ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నారు. ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని ప్రజలు కోరుతున్నందున అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పక్షాన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని 17 గ్రామాలకు చెందిన 40 వేల మంది ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారన్నారు. డంపింగ్ యార్డ్ను రద్దు చేయాలని ప్రజలు 16 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమాన్ని ఇందిరాపార్క్ వరకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, అధికారులు ఆలోచించి డంపింగ్ యార్డ్ను రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని, ఆ పోరాటంలో సీపీఐ(ఎం) ముందు భాగాన నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, ఏజేసీ నాయకులు గోవర్ధన్రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.అడివయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, కె.రాజయ్య, అతిమేల మాణిక్, జి.సాయిలు, ఎం.నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్, ప్రవీణ్కుమార్, నాయకులు పాండురంగారెడ్డి, అశోక్, రమేష్ గౌడ్, జేఎసీ నాయకులు కుమార్గౌడ్, మాజీ సర్పంచ్ శంకరయ్య, , సురేష్, మల్లేశ్, శ్రీనివాస్, ఉదయ్, అంజేయులు, తదితరులు పాల్గొన్నారు.