అందరి అభివృద్ధికి రాజ్యాంగమే కారణభూతం
ప్రస్తుత ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలను సాధిస్తోంది
మహిళా రిజర్వేషన్ల చట్టంతో కొత్త శకానికి నాంది
రాజ్యాంగ పరిషత్తులోనూ 15 మంది మహిళల కృషి
రాజ్యాంగం 75 వసంతాల వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
న్యూఢిల్లీ, నవంబర్ 26: భారత రాజ్యాంగం సజీవమైన ప్రగతిశీల గ్రంథమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. రాజ్యాంగం ద్వారానే దేశంలో సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించామని పేర్కొన్నారు. దేశానికి రా జ్యాంగం మూలస్తంభమని, భారత్‌కు పవిత్ర గ్రంథమని ముర్ము చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించి మంగళవారంతో 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్ సదన్ (పాత పార్లమెంట్ భవనం)లోని సెంట్రల్ హాల్‌లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.
రాజ్యాంగ పరిషత్తులో 15 మంది మహిళలు భాగస్వాములుగా ఉన్నారని ము ర్ము గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభు త్వం తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ల చట్టం తో స్త్రీ సాధికారత దిశగా కొత్త శకం మొదలైందని రాష్ట్రపతి ముర్ము ఉద్ఘాటించారు.
రాజ్యాంగ సూత్రాలను పాటిస్తున్నాం
రాజ్యాంగం భారత ప్రజలకు పవిత్ర గ్రంథం. ప్రజాస్వామ్యం, గణతంత్రమే లక్ష్యంగా రాజ్యాంగ రూపకల్పన జరిగింది. ఇందుకోసం అంబేడ్కర్, రాజేంద్రప్రసాద్, నెహ్రూ, పటేల్ వంటి ఎంతో మంది మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పేర్కొన్నారు. వారి కృషిని మనం స్మరించుకోవాలి. కొన్నేళ్లుగా దేశంలోని అన్ని వర్గాలు ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంది. ఇలాంటి నిర్ణయాలతోనే ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయి.
వారి అభివృద్ధికి అవసరమైన అవకాశాలు లభిస్తున్నాయి. పేద ప్రజల సొంతింటి కల నిజమవుతోంది. విద్యుత్, తాగునీరు రోడ్డు సదుపాయాలు మెరుగవుతున్నాయి. వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తు న్నాయి. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా చేపడుతున్న చర్యలు రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళుతున్నాయి అని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు.
అది ప్రజాస్వామ్యానికి ముప్పు: ఉపరాష్ట్రపతి ధన్‌కడ్
రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ మాట్లాడుతూ.. దేశం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తే మనం పోరాడి సాధించుకున్న స్వాతం త్య్రం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. చర్చా వేదికల్లో గందరగోళం సృష్టించడం ఒక వ్యూహంగా భావించి అమలు చేస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అన్నా రు. నిర్మాణాత్మక చర్చలు ప్రజాస్వామ్యంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడుతాయని పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవ ప్రారంభ ఉపన్యాసంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. 75 ఏళ్ల క్రిత ఆమోదించిన రాజ్యాంగంపై చర్చ సమయంలో రాజ్యాంగ సభ నిర్దేశించిన నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చల సంప్రదాయాన్ని అనుసరించాలి అని సభికులకు సూచించారు.
తపాలా బిళ్ల విడుదల
రాష్ట్రపతి ముర్ము ప్రసంగం తర్వాత సభ్యులందరితో కలిసి రాజ్యాంగ ప్రవేశికను సామూహిక పఠనం చేశారు. అంతకుముందు రాజ్యాంగానికి సంబంధించిన రెండు పుస్తకాలు, రాజ్యాంగ వజ్రోత్సవాలకు గుర్తుగా పోస్టల్ స్టాంప్‌ను ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. అంతేకాకుండా మైథిలీ, సంస్కృత భాషల్లో రాజ్యాంగ ప్రతులను ఆవిష్కరించారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా ఉభయ సభల సభ్యులంతా పాల్గొన్నారు.