శతాబ్దాల పాటు భారత్‌కు మార్గదర్శిగానే ఉంటుంది
భవిష్యత్తు అవసరాలు రాజ్యాంగ నిర్మాతలకు తెలుసు
అన్నింటికీ అనుకూలంగా నిబంధనలు రూపొందించారు
ఇప్పుడు కశ్మీర్‌లోనూ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది
ప్రధానమంత్రి నరేంద్రమోదీ
న్యూఢిల్లీ, నవంబర్ 26: బ్రిటిష్ వలస పాలన తర్వాత పరివర్తన కాలంలో భారతదేశానికి రాజ్యాంగం వెలుగు బాట చూపిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత రాజ్యాంగాన్ని జీవన స్రవంతిగా అభివర్ణించిన ప్రధాని శతాబ్దాల పాటు కొనసాగేలా ఈ దీపికను రూపొందించారని రాజ్యాంగ నిర్మాతలపై ప్రశంసలు కురిపించారు. సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ 75వ వసంతోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. భారత్‌కు రాజ్యాంగం మార్గదర్శిగా నిలిచింది.
దేశం ఎటు వెళ్లాలో మార్గం చూపింది. భారతీయులకు సత్వర న్యాయం జరగాలి. అందుకోసమే కొత్త న్యాయ చట్టాలను తీసుకొచ్చాం. ప్రధాని పదవికి రాజ్యాంగం కల్పించిన హద్దులను నేను ఎప్పుడూ జవదాటలేదు. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి పౌరుడి లక్ష్యం ఒకటే. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం అని మోదీ తెలిపారు.
శతాబ్దాల పాటు జీవనాధారం
రాజ్యాంగ దినోత్సవరం సందర్భంగా మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాటలను మోదీ ప్రస్తావించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ముగింపు ప్రసంగంలో మాట్లాడుతూ దేశానికి నిజాయతీ కలిగిన బృందం నాయకత్వం వహించాలని అన్నారు. వీరు సొంత ప్రయోజనాల కన్నా దేశమే ముఖ్యమని భావించాలని పేర్కొన్నారు. ఇంతకన్నా భారత్‌కు ఏదీ అవసరం లేదని ప్రసాద్ చెప్పారు.
అంటే దేశమే ముఖ్యమని భావిస్తే మన రాజ్యాంగం శతాబ్దాల పాటు మనుగడ సాగిస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలకు భారతదేశ లక్ష్యాలేంటో తెలుసు. కాలానుగుణంగా భారత్ వాటిని సాధిస్తుంది. ప్రజల్లో మార్పుతో పాటు కొత్త సవాళ్లు ఎదురవుతాయని కూడా తెలుసు. అందుకే వాళ్లు కేవలం రాజ్యాంగాన్ని నిబంధనల పుస్తకంగా మాత్రమే రాయలేదు. శతాబ్దాల పాటు జీవనాధారంగా, నిరంతర ప్రవాహంగా ఉండేలా రూపొందించారు. భారత రాజ్యాంగం కాల పరీక్షకు నిలిచి దృఢంగా ఉంది అని మోదీ పేర్కొన్నారు.
ఉగ్రవాదానికి దీటుగా బదులిస్తాం
ఉగ్రవాదానికి భారత్ దీటుగా బదులిస్తుందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇప్పుడు భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిందని, తొలిసారి కశ్మీర్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుం టున్నామని పేర్కొన్నారు. దేశమే ముందు అనే భావన అనేక దశాబ్దాల పాటు రాజ్యాంగాన్ని సజీవంగా ఉంచుతుందని పేర్కొన్నారు. ముంబైలో ఉగ్రదాడి ఇదే రోజు జరిగిందని, ఆ విషాద ఘటనలో మృతిచెందినవారికి నివాళులు అర్పిస్తున్నానని మోదీ తెలిపారు.
ప్రతి శాఖా రాజ్యాంగాన్ని గౌరవించాలి: సీజేఐ
సుప్రీంకోర్టులో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ శాఖకు రాజ్యాంగం వేర్వేరు బాధ్యతలను అప్పగించిందని, వాటిని అందరూ గౌరవించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయవ్యవస్థను వేరు చేయడం ద్వారా ఎలాంటి భయాలు, పక్షపాతాలకు తావు ఉండదని ఆయన చెప్పారు. రాజ్యాంగంలో ఇలాంటి పరిమిత నిబంధనలు ఎన్నో ఉన్నాయని, వాటిని సక్రమంగా అనుసరిస్తే ఎలాంటి విభేదాలు, సమస్యలు తలెత్తవని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్, సుప్రీం జడ్జీలు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, అటార్నీ జనరల్ ఆర్ వెంకటస్వామి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పాల్గొన్నారు.