calender_icon.png 21 March, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల హామీ ఎప్పుడు నెరవేరుస్తారు

20-03-2025 06:14:21 PM

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్..

కొత్తగూడెం (విజయక్రాంతి): జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే నెరవేర్చాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని గంగబిషన్ బస్తీలో ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకంగా కొనసాగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వారికి ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.

జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం 20 సంవత్సరాలుగా పోరాడుతున్నారని ప్రతీ పార్టీ ఎన్నికల సమయంలో గెలిస్తే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం గెలిచాక హామీని తుంగలో తొక్కడం పరిపాటిగా మారిందని విమర్శించారు.ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ వృత్తి పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విలేఖరులు జీతభత్యాలు లేక కుటుంబాలకు విద్యా,వైద్యం అందించలేక ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని, లేనిపక్షంలో జర్నలిస్టులు చేసే పోరాటానికి మద్దతు వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబీ, మురళి తదితరులు పాల్గొన్నారు.