మధు హత్యతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు
కాంగ్రెస్ పార్టీపై జగదీశ్ రెడ్డి ఆరోపణలు నిరాధారం
హత్యా రాజకీయాల గురించి ఆయన మాట్లాడడం హాస్యాస్పదం
డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య
సూర్యాపేట, మే 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్యతో కాంగ్రెస్ కి ఎలాంటి సంబంధం లేదని విచారణను ప్రభావితం చేసేందుకే మాజీమంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. హత్య రాజకీయాల గురించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. మధు హత్య పాత కక్షలతో జరిగిందా వ్యక్తిగత కక్షలతో జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు.
హత్య రాజకీయాలను ఏనాడు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించలేదన్నారు. మూడుసార్లు ఓడిపోయినప్పటికీ మాజీ మంత్రి దివంగత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఏనాడు గొడవలు ప్రోత్సహించలేదన్నారు. రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారన్నారు.మాజీమంత్రి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆ హత్యతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని త్వరలోనే నిజాలు తేలుతాయన్నారు.మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై, పార్టీపై లేనిపోని నిరాధారణమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజాద్ అలి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి కక్కిరెని శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంగరి గోవర్ధన్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు, మున్సిపల్ కౌన్సిలర్ నాగుల వాసు, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు వెన్న మధుకర్ రెడ్డి, మద్దెబోయిన శ్రీనివాస్, కోడి వెంకటయ్య, బొప్పాని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






