కాంగ్రెస్ అంటేనే మోసాలకు, నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్...
బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు...
కరీంనగర్ (విజయక్రాంతి): రైతులకు పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15,000 ఇస్తామని ఆశలు పెట్టి ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేడు రూ.12 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్(CM Revanth Reddy) ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని, కాంగ్రెస్ అంటేనే మోసానికి, నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిదని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. సోమవారం కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సభల్లో ప్రతి చోట రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఇప్పుడైతే 10 వేలు, మాకు ఓటేస్తే 15వేలు ఇస్తం' అని ఊరించిండని, కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆరు గ్యారంటీల్లో ఈ పథకం వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిందన్నారు.
రైతాంగాన్ని అప్పుడు నమ్మించి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారని, ఇప్పుడు మాటలు మారుస్తూ రైతులను దారుణంగా వంచిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆశలను కాంగ్రెస్ అడియాసలు చేసిందని, రైతు భరోసాను రైతు గుండెకోతగా మార్చారన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి, రూ.6 వేలకు కుదించారని విమర్శించారు. వాన కాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితో పాటు కలిపి ఎకరానికి రూ.15 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టడం ద్వారా అదొక చిల్లర నాటకంగా మార్చేశారని.. బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోగస్గానే మిగిలిపోయిందన్నారు. పంటల బీమా పత్తా లేకుండా పోయిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.