calender_icon.png 4 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ ఉపాధి బాధ్యత కాంగ్రెస్ సర్కారుదే

02-08-2024 01:12:52 AM

  1. రంగారెడ్డి జిల్లా బేగరికంచెలో ఫోర్త్ సిటీ 
  2. నాలుగేండ్లలో న్యూయార్క్‌లాంటి నగరం నిర్మిస్తాం 
  3. ప్రపంచస్థాయి నైపుణ్య యువతను తయారుచేస్తం
  4. స్కిల్ వర్సిటీలో అడ్మిషన్స్ దొరికితే ఉద్యోగం దొరికినట్టే
  5. విద్య, వైద్యం, క్రీడలు, పరిశ్రమల హబ్‌గా కొత్త నగరం
  6. బేగరి కంచెవరకు మెట్రోను తీసుకువస్తా
  7. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
  8. బేగరికంచెలో స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన

రంగారెడ్డి, ఆగస్టు 1 (విజయక్రాంతి): తెలంగాణ యువతకు అన్ని రంగాల్లో నైఫుణ్య శిక్షణ ఇచ్చి ప్రపంచ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొంటుందని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. లక్షలు పెట్టి చదివినా నైపుణ్యం లేకపోతే ప్రస్తుతం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని, వారందరికి ఉద్యోగ కల్పన కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.

రంగారెడ్డి జిల్లా బేగరికంచెలో నాలుగేండ్లలో న్యూయార్క్‌ను తలదన్నెలా మహానగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టు కొని తాము పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తుంటే.. కొందరు అపరపక్వతతో వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం రంగారెడ్డి జ్లిలా కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్ పేట్ బేగరికంచెలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో సిటీ ఆడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాలకు సీఎం శంకుస్థాపన చేశారు. అసెంబ్లీ  స్పీకర్ ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కలిసి భూమిపూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో నిరుద్యోగుల పాత్ర కీలకమని గుర్తుచేశారు. గత ప్రభుత్వం వారి ఆశయాలకు, ఆలోచనలకు తూట్లు పొడిచిందని ఆరోపించారు. అందుకే  యావత్ తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ యువత భవిష్యత్తును బంగారుమయం చేసేందుకు తాము ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామని చెప్పారు. బేగరికంచెలో 57 ఎకరాల్లో రూ.157 కోట్లతో అద్భుతంగా స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ను నవాబులు, సికింద్రాబాద్‌ను బ్రిటిష్ వాళ్లు, సైబరాబాద్‌ను చంద్రాబాదు, వైఎస్ నిర్మిస్తే.. బేగరికంచె ఫోర్త్ సిటీని తాము నిర్మిస్తామని పేర్కొన్నారు. ఒక నగరం నిర్మించాలంటే విద్య, వైద్యం, ఉపాధి లాంటి మౌలి క వసతులు  భారీగా అవసరమని తెలిపారు. 

నెహ్రూ దూరదృష్టితో అద్భుత ప్రణాళికలు

దేశంలో విద్య, సాగునీటికి అద్భుతమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దివంగత ప్రధాని నెహ్రూ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. దేశం అభివృద్ధిలో పరుగులు తీయాలంటే యూనివర్సిటీలు, ప్రాజెక్టులు ఎంతో అవసరమని గుర్తించి వాటికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌కు తాగునీటి కోసం కృష్ణా, గోదావరి నీటిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చిందంటే చాలు మీ పిల్లలకు ఉద్యోగం గ్యారెంటీ అని ఆయన భరోసా కల్పించారు.

ఈ ప్రాంతం ఏవరూ ఊవించని విధంగా దుబాయి, న్యూయార్క్ కంటే అధునాతన నగరాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఇక్కడ హెల్త్‌హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నాగోల్ నుంచి ఒవైసీ మీదుగా చంద్రాయణ్‌గుట్ట, ఎయిర్‌పోర్ట్ మీదుగా బేగరికంచెకు మెట్రోను తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, హిమాయత్‌నగర్, అబిడ్స్, కోఠి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కోకాపేట ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందాయో.. అంతకంటే అద్భుతంగా ప్రపంచమంతా బేగరికంచవైపు చూసేలా మహానగరం ఇక్కడికే రాబోతుందని అన్నారు. 

కాలుష్య రహిత ప్రగతి: మల్లు భట్టి విక్రమార్క

ముచ్చర్ల ప్రాంతాన్ని గత ప్రభుత్వం ఫర్మాసిటీ పేరుతో కాలుష్యమయంగా మార్చాలని చూస్తే తాము కాలుష్య రహిత అభివృద్ధికి బాటలు వేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులు ఇబ్బందులు పడ్డారని, వారికి కూడా న్యాయం జరిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా చూస్తామని తెలిపారు.  

కొత్త అన్వేషణ ప్రారంభం: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కొత్త ఆలోచనలు, కొత్త అన్వేషణలు, కొత్త గమ్యం చేరడానికి స్కిల్ యూనివర్సిటీ నాంది పలుకుతుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.  

కొత్త సిటీ ప్రపంచానికి ఆదర్శం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..

బెగరకంచలో నిర్మించే యంగ్ స్కిల్ యూనివర్సిటీ ప్రపంచపటంలో స్థానం దక్కించుకోబోతున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, ఏదైనా అనుకుంటే చేసి చూపిస్తామని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే 40 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. ఆగస్టులో 31 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిన విధంగా రుణామాఫీ చేసి చూపించామని అన్నారు. 

 ఏవరూ అధైర్యపడొద్దు

 ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు తాను అండగా ఉంటానని సీఎం హామీ ఇచ్చారు. ‘మీ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తా. మీ పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకొంటుంది. గత ప్రభుత్వం కాలుష్య పరిశ్రమలను తీసుకొచ్చి మీ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూసింది. గతంలో ఎల్‌బీ నగర్ ప్రాంతంలో సిరీస్ ఫ్యాక్టరీ పరిస్థితి మీరు చూశారు కదా! గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాంతాన్ని నెట్ జీరో కేంద్రంగా తీర్చిద్దితా. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటా. మీ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుంది’ అని హామీ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతామని, వచ్చే మూడు నెలల్లో పనులకు శంకుస్థాపన చేసుకొందామని సీఎం చెప్పారు.