calender_icon.png 25 November, 2024 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

06-11-2024 05:51:59 PM

మంచిర్యాల (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం యువతను మోసం చేసిందని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ నాయకుడు అన్నారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా బిజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ నాయకుడు పాల్గొని మాట్లాడారు. బిజెపి బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఇచ్చిన హామీలను పక్కనపెట్టి తెలంగాణలో హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టిస్తుందని అన్నారు. హైడ్రా పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతుందని అన్నారు. యువకులకు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చి ఇప్పుడు కాలయాపన చేస్తూ, ఉద్యోగాలు కావాలని రోడ్లపైకి వచ్చిన యువతపై లాఠీ చార్జ్ చేస్తూ కేసులు పెడుతుందని అన్నారు.

గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో నిరుద్యోగులు మోసపోయారని ఈ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని యువకులు భావించి అధికారాన్ని కట్టబెడితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి అభ్యర్థులను ప్రజలు గెలిపిస్తారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకొని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తక్షణమే నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమీర్ శెట్టి రాజు, పట్టణ అధ్యక్షులు బింగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు తరుణ్ సింగ్ చిరంజీవి, విష్ణు, మండల అధ్యక్షులు వెంకటేష్ నరేష్, కార్యకర్తలు, జగ్జీత్ సింగ్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.