calender_icon.png 25 October, 2024 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఎజెండా అభివృద్ధి కాదు.. విధ్వంసం

05-05-2024 01:01:26 AM

ఆ పార్టీ అధికారంలోకి వచ్చాకే కరెంట్ కోతలు

బీజేపీ నేతలవి మత రాజకీయాలు

ట్రిపుల్ ఐటీ గురించి బండి సంజయ్ పట్టించుకోలె

బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్ 

కరీంనగర్ సిటీ, మే 4: కాంగ్రెస్ ఎజెండా అభివృద్ధి కాదు విధ్వంసమని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కరీంనగర్‌లో శనివారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలైనా ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని, అలా చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ రైల్వేలైన్‌ను తీసుకువచ్చామన్నారు. ఐదు జాతీయ రహదా రులకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే, వాటిలో రెండు రహదారులకు అనుమతులు వచ్చాయని గుర్తుచేశారు. కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ తెచ్చేందుకు కృషి చేశామన్నారు.

ఎంపీగా బండి సంజయ్ ఆ అంశాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తాను ఎన్నికల్లో గెలిచి ట్రిపుల్‌ఐటీ తీసుకువస్తానన్నారు. సింగపూర్ తరహాలో స్థానికంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లకు వారానికే బిల్లులు ఇచ్చి, రైతులకు మాత్రం రైతుబంధు ఇవ్వడం లేదని నిప్పులు చెరిగారు. పంటలకు కరెంట్ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీజేపీ పదేళ్ళ పాలనలో డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. ప్రధాని మోదీ మత రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారని, అలాంటి వారితో పార్టీకి నష్టం లేదన్నారు. సమావేశంలో నగర మేయర్ సునీల్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర డిప్యూటీ మేయర్ జల్లా స్వరూపారాణి, నాయకులు అనిల్‌కుమార్ గౌడ్, చల్లా హరిశంకర్ పాల్గొన్నారు.