10-02-2025 06:19:12 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శాసనమండలి పట్టబద్రుల, ఉపాధ్యాయం ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన శాసనమండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ... మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనున్నందున జిల్లాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు, ఫర్నిచర్, షామియానా, మూత్రశాలలు, క్యూ లైన్లు ఇతర అన్ని ఏర్పాట్లు చేయాలని తహసిల్దార్ ను ఆదేశించారు.
అనంతరం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరుపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం పాఠశాలలో 10వ తరగతి ఫలితాలు, ఈసారి ఫలితాల సాధన అంశాలపై మాట్లాడుతూ... విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు తరగతులు నిర్వహించి ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. పరీక్షలకు 40 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ప్రణాళికకు అనుగుణంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రోహిత్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.