calender_icon.png 25 October, 2024 | 12:59 PM

రైళ్ల పరిస్థితేంది!

11-07-2024 01:44:11 AM

ఎంఎంటీఎస్‌లపై ఆరా తీసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పుడు సగానికి పైగా తగ్గి సమయపాలన లేకుండా నడుస్తున్న తీరుపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరా తీశారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ప్రశ్నించారు. బుధవారం దిల్‌ఖుషా గెస్ట్ హౌస్‌లో ద.మ. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు.

జంట నగరాల ప్రజలకు కేవలం రూ. 5 నుంచి ప్రారంభమయ్యే టికెట్ ధరలతో చక్కని సేవలు అందించే ఎంఎంటీఎస్ రైళ్లు ప్రస్తుతం చాలా మేర తగ్గిపోయాయి. దానికి తోడు ప్రస్తుతం ఈ స్థానిక రైళ్ల రాకపోకల సమయం కూడా అర్థం కాని పరిస్థితి తలెత్తింది. స్థానికులు చాలా కాలం నుంచి ఈ విషయాలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా... రైల్వే అధికారులను ఆరా తీశారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అడిగినట్లు సమాచారం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కిషన్ రెడ్డి ఆదేశించారు.