calender_icon.png 9 February, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వర్గ పోరాట దిక్సూచి మంచికంటి

08-02-2025 09:11:49 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కార్మిక వర్గ పక్షపాతి మంచికంటి రాంకిషన్ రావు అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక మంచికంటి భవన్లో శనివారం మంచికంటి 31 వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా మంచికంటి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భూస్వామ్య కుటుంబానికి దత్త పుత్రుడుగా వెళ్ళినప్పటికి పేదలు కార్మికుల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడనీ అన్నారు. కామంచికల్ గ్రామంలో తన వాటా కింద వచ్చిన వందల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసి పేదల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారని కొనియాడారు.

ఖమ్మం ఎమ్మెల్యేగా ప్రజలకు ఖమ్మం ప్రజలకు సేవ చేస్తూనే కొత్తగూడెంలో కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు అని అన్నారు. ఎమ్మెల్యేగా ఉంటూ అతి సాధారణ జీవితం గడిపాడని నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి మంచికంటి అన్నారు. ప్రజా ఉద్యమంలో ఎన్నో కేసులు నిర్భందాలు ఎదురైన తను నమ్మిన ఎర్రజెండాను వీడలేదని అనారోగ్యంతో ఉన్న జైలు అధికారులు కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి హాస్పిటల్ కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టిన కమ్యూనిస్టు ఉద్యమాన్ని విడిచిపెట్టలేదని అకుంఠిత దీక్షతో పార్టీ నిర్మాణానికి ప్రజా పోరాటాల నిర్మాణానికి కృషి చేశారని అన్నారు.

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కామంచికల్ కేంద్రంగా దొరలు పటేలు పట్వారి భూస్వాములకు వ్యతిరేకంగా పేదల పక్షాన పోరాటం చేశాడని మంచి కంటి పోరాట మార్గం సదా ఆదర్శమని ఆయన కొనియాడారు. పేదల రాజ్యం కోసం మంచి కంటే పరితపించాడని అలాంటి రాజ్యం కోసం పోరాటాలు చేయడమే మంచి కంటికి ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే బ్రహ్మచారి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్, భూక్య రమేష్, యాస నరేష్, నాయకులు డి వీరన్న, రమేష్, వై వెంకటేశ్వరరావు, అభిమిత్ర విజయ్ సలీం తదితరులు పాల్గొన్నారు.