“అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు.” అని సగర్వంగా ప్రకటించడమేకాక ఉద్యమాన్నే ఊపిరిగా భావిస్తూ, కడదాకా జీవించిన మహానుభావుడు మన ఆధునిక ప్రజాకవి కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబరు 9 న (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. వారి కుటుంబం తర్వాత వరంగల్‌లో స్థిరపడ్డారు.
కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతి గాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో ఆయనకు ఆయనే సాటి. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి, ప్రజాకవిగా కీర్తి గడించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదనలు ఆయన గేయాల్లో ఎంతో గొప్పగా రూపు కడతాయి. నాటి హైదరాబాద్ రాజ్య పాలకుడు నిజాం దౌష్ట్యాలకు వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాశారు.
ఆగ్రహించిన నిజాం రాజు కాళోజీకి వరంగల్ నగర బహిష్కరణ విధించారు. దాంతో ఆయన మరింత అంకితభావంతో అక్షరాలు ప్రయోగించారు. ఫలితంగా 1939, 1943లలో రెండుసార్లు జైలుకి పోవాల్సి వచ్చింది. 1958లో ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. వారికి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. “హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు” అంటూ “సామాన్యుడే నా దేవుడు” అని ప్రకటించారాయన. 88 సంవత్సరాల వయసులో 2002 నవంబరు 13న తుదిశ్వాస విడిచారు.
-‘అక్షర’ డెస్క్