01-03-2025 07:27:35 PM
బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి...
కరీంనగర్ (విజయక్రాంతి): ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చొప్పదండి మండలం భూపలపట్నం గ్రామానికి చెందిన రైతు గుఱ్ఱం దేవేందర్ రెడ్డికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బిజెపి కిసాన్ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో శనివారం రోజున జరిగిన విలేకరుల సమావేశంలో సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ... రైతు గుర్రం దేవేందర్ రెడ్డికి 2022 లోనే పట్టాదారు పాస్ బుక్ జారీ అయినప్పటికీ రైతు బీమా పథకంలో అతని పేరు నమోదు కాలేదని, ఇన్నేళ్లుగా అతని పేరు బీమా పథకంలో నమోదు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
బీమా లేని కారణంగా మృతుడు దేవేందర్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. ఆపదలో రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన రైతు భీమా పధకం పరిహారం అందక నేడు అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. రైతు భీమా నమోదు చేయించని సంబంధిత అధికారుల, ప్రభుత్వ వైఫల్యానికి భాధ్యత వహించి స్థానిక చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం రైతు కుటుంబానికి ఐదులక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి రైతు బీమాలో నమోదు చేయించబడని రైతుల సంఖ్య ఏడున్నర లక్షలుగా ఉందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయన్నారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి గ్రామంలో సుమారు 50 నుంచి 100 మంది రైతులు రైతు బీమా పథకంలో నమోదు చేయబడలేదన్నారు.
ఇలాంటి రైతులకు బీమా లేని కారణంగా ఆకస్మాత్తుగా వారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వాళ్ల కుటుంబాలకు ధిక్కెవరని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్లో రైతు బీమాకు డబ్బులు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో అర్హత ఉన్న రైతులను కూడా నమోదు చేయడంలో అశ్రద్ధ, నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడున్నర లక్షల మంది రైతులను బీమా పథకంలో నమోదు చేయించకుండా వ్యవసాయ శాఖ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దీనికి బాధ్యత వహిస్తూ తెలంగాణ వ్యవసాయ కమిషనర్ ని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అలాగే వ్యవసాయ శాఖ పనితీరు పట్ల అశ్రద్ధను చూపుతున్న ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు తొట్ల తిరుపతి గుడిపాక సురేష్, ఎంపిటిసి గొల్ల సునంద గట్టయ్య, భూపాలపట్నం మాజీ ఉప సర్పంచ్ బైరగొని కిట్టు గౌడ్, సీనియర్ నాయకులు సింగిరెడ్డి భూమిరెడ్డి, మొగిలి సారయ్య, ఉకంటి నరసింహారెడ్డి, దామెర మధుసూదన్ రెడ్డి, వెంకటేష్ అఖిల్ గాండ్ల వేణు గోపాల్, గోపు వెంకట్ రెడ్డి, శంకర్, దూస చిరంజీవి, టంగు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.