30-04-2025 12:49:12 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్29: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కరీంనగర్ పోలీసు కమీషనర్ గౌష్ ఆలం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్, పోలీసు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను సరైన పద్ధతిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను తరచూ సందర్శిస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. డివిజన్ల వారీగా ఏసీపీ అధికారులు ప్రతి నెలా నేర సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. సీసీసీ ద్వారా వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఆకస్మికంగా తలెత్తే శాంతిభద్రతల సమస్యలను ఎదుర్కొనేందుకు సిబ్బంది లాఠీలు, హెల్మెట్‌లు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.
ఎస్ హె ఓలుగా విధులు నిర్వహిస్తున్న ఎస్సు, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు పోలీస్ స్టేషన్ మేనేజ్‌మెంట్‌ను సక్రమంగా నిర్వహించాలని, పోలీస్ స్టేషన్ మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. రికార్డుల నిర్వహణ సరైన పద్ధతిలో ఉండాలని, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని సూచించారు. పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి, వాటికి గల కారణాలను తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వాధీనం చేసుకున్న వాహనాలను రికార్డుల్లో నమోదు చేయాలని, వదిలివేయబడిన వాహనాలను వేలం వేసేందుకు పై అధికారులకు తెలియజేయాలని చెప్పారు.
రికార్డు నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్ బుక్‌ల ఏర్పాటు, సమన్ల జారీ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఐపీఎస్, ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర, అడిషనల్ ఎస్పీ నరేందర్, ఏసీపీలు వెంకటస్వామి (టౌన్), హుజురాబాద్ ఏసీపీ సిహె శ్రీనివాస్, యాదగిరి స్వామి (ట్రాఫిక్), శ్రీనివాస్ (ఎస్బి), మాధవి (ఫంక్షనల్ వర్టికల్స్), వేణుగోపాల్ (సీటీసీ), కాశయ్య (సీసీఎస్) లతో పాటు కమిషనరేట్‌లోని అన్ని విభాగాల, పోలీస్ స్టేషన్ల, సర్కిల్‌లకు చెందిన ఇన్‌స్పెక్టర్లు, హెడ్ క్వార్టర్స్ లోని అన్ని విభాగాల రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్ హె ఓలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.