24-03-2025 12:00:00 AM
రామాయంపేట, మార్చి 23: మెదక్ జిల్లా కలెక్టర్ వినూత్న కార్యక్రమాలకు పెట్టింది పేరు...కార్యాలయంలో కంటే క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని భావించే వ్యక్తి...పొలంలో నాట్లు వేసే పనినుండి పాఠశాలలో పాఠాలు చెప్పి ఉద్యోగుల పనితీరు ఎలావుండాలో ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నారు.
తాజాగా ఆదివారం నాడు మెదక్ నుండి సైక్పి కలెక్టర్ దంపతులు రామాయంపేట వరకు వెళ్ళి అక్కడి ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మిక తనిఖీ చేశారు. తిరిగి అక్కడి నుండి ఆర్టీసీ బస్సులో కలెక్టర్ దంపతులు ప్రయాణించి మహాలక్ష్మీ పథకం గురించి ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ నుండి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్ పై వెళ్లి రామయంపేట బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం అక్కడి నుండి తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో మెదక్ చేరుకున్నారు.. రామాయంపేట బస్టాండ్ లో తాగునీరు, ప్రయాణికులు సేదతీరు బస్టాండ్ లో ఉన్న బెంచీలు, ఇతర వసతులను పరిశీలించారు. శుభ్రతకు సంబంధించి ఆర్టీసీ డీఎంను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని, వారి సహకారంతో ఆర్టీసీ బస్టాండ్లను ఆధునీకరించి బస్టాండ్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నామని చెప్పారు.
అందులో భాగంగానే మెదక్, రామాయంపేట బస్టాండ్ ను సందర్శించడం జరిగిందన్నారు.. మహిళా సాధికారత లక్ష్యంగా మహిళలకు ఆర్టీసీ మహాలక్ష్మి పథకం సత్ఫలితాలు ఇస్తుందని తెలిపారు. సరిపడా బస్సులు ప్రయాణికులకు కేటాయించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలకే స్వయంగా బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు తిప్పిన ఎడల వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వాళ్ళవుతామని చెప్పారు. బస్టాండ్ లో తాగునీరు, పరిశుభ్రత, ప్రయాణీకులకు సౌకర్యాలు బాగున్నాయని చెప్పారు. ఇంకా మెరుగైన సౌకర్యాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.
మెదక్ బస్టాండ్ లో అదనపు ఫ్లాట్ ఫాంల ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన బస్సులు మెదక్ జిల్లాకు మంజూరయ్యే విధంగా నివేదికలు పంపించామని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధి చేసే దిశగా సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని వివరించారు.
మహిళా ప్రయాణికులకు ఎక్కువ బస్సులు కేటాయించి వారి ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం సురేఖ, సంబంధిత ఆర్టీసీ అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.