calender_icon.png 17 January, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలి తీవ్రత ఎక్కువే!

20-12-2024 12:00:00 AM

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాలు చలికి గజగజ వణికి పోతున్నాయి. సాధారణంగా దేశంలో శీతాకాలం డిసెంబర్ మధ్యలో మొదలై జనవరి చివరి దాకా కొనసాగేది. అయితే ఈ సారి డిసెంబర్ ప్రారంభంనుంచే చలికాలం మొదలైం ది. ముఖ్యంగా గత వారం రోజులుగా రోజుకు రెండు మూడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర భారతం ముఖ్యంగా కశ్మీర్ అయితే చలికి గడ్డకట్టుకు పోతోంది.

శ్రీనగర్‌తో పాటుగా అనేక ప్రాంతా ల్లో రాత్రిపూట కనీస ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీనికి తోడు పర్వత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తుండ డంతో ఇళ్లు, రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. జలాశయాలన్నీ గడ్డకట్టుకు పోవడంతో తాగునీటి సరఫరాకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడు తోంది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, హర్యా నా, యూపీ సహా ఉత్తరాది అంతా చలిగాలుల తీవ్రతతో వణికి పోతోంది.

దీనికి తోడు ఉదయం పది గంటలదాకా దట్టమైన పొగమంచుతో జనం బైటికి రావడానికే జంకుతున్నారు. సాధారణంగా ఉత్తరాదిన శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా చలి ఉందని జనం అంటున్నారు. లా నినా ప్రభావం కారణంగా ఈ ఏడాది అధిక వర్షాలతో పాటుగా చలి కూడా ఎక్కువే ఉంటుందని భారత వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది.

సాధారణంగా ఏప్రిల్ జూన్‌లో మొదలయ్యే లా నినా ప్రభావం అక్టోబర్‌ఫిబ్రవరి మధ్య కాలంలో బలపడుతుంది. దీని కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాలు మామూలుకన్నా ఎక్కువగా చల్లబడడం, ఫలితంగా బలమైన శీతగాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతుం ది. దీనికి తోడు ఈ సారి వర్షాలు అధికంగా కురవడం, డిసెంబర్ నెలలో వరసగా వచ్చిన అల్పపీడనాల కారణంగా వాతావరణం పొడిగా తయారు కావడం కూడా దేశంలో చలి తీవ్రత పెరగడానికి ప్రధాన కారణాలు.

ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ సారి తక్కువ వర్షాలు పడడం, గాలిలో పొడి వాతావరణం తోడయి చలి తీవ్రత ఎక్కువైంది. ఈసారి శీతాకాలం లో మరో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే పగటి ఉష్ణోగ్రతలకన్నా కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.ఈ సంవత్సరం శీతాకాలం ఫిబ్రవరి దాకా కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఉత్తరాదిన బలంగా వీస్తున్న శీతగాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనా పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో గత వారం రోజులుగా కనీస ఉష్ణోగ్రతలు పది డిగ్రీలకన్నా తక్కువకు చేరుకుంటున్నాయి. హైదరాబాద్‌లోనే రాజేంద్రనగర్, పటాన్‌చెరులాంటి కొన్ని ప్రాంతాల్లో ఆరేడు డిగ్రీల కు పడిపోయాయి. అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. చలితో పాటుగా పొగమంచు కారణంగా ఆదిలాబాద్ జిలాలో స్కూళ్ల టైమింగ్స్‌ను కూడా మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మూడు రోజుల క్రితం జిల్లాలో కనీస ఉష్ణోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. పంట కోతల సమయం అయినా చలి కారణంగా కూలీలు దొరకడం కష్టంగా మారుతోందని రైతులు వాపోతున్నారు. అటు ఏజన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాత్రుళ్లు జనం బైటికి రావడానికే భయపడతున్నారు. ఒకప్పుడు అర్ధరాత్రి కూడా జనం హడావుడితో కనిపించే హైదరాబాద్ రోడ్లు ఇప్పుడు పది గంటలకే నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

చలి తీవ్రత కారణంగా చిన్నపిల్లులు, వృద్ధుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఏ ఇంట్లో చూసినా జలుబు, జ్వరాలతో బాధపడే వారే కనిపిస్తున్నారు. అయితే మరో మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్తున్నారు. అప్పటివరకు ఈ కష్టాలు తప్పవు.